పెళ్లిని కొందరు హంగు ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే, మరికొందరు మంచి సందేశాన్ని ఇచ్చేదిగా తమ పెళ్లి ఉండాలనుకుంటారు. అయితే ఇటువంటి పచ్చటి వివాహాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ వివాహం అంతా అడుగడుగునా పాడి పంటలే, ప్రకృతి ఉత్పత్తులే!
అలెప్పీ జిల్లా హరిపాద్ గ్రామానికి చెందిన వాణికి వ్యవసాయమంటే ప్రీతి. వ్యవసాయంలో డిగ్రీ సాధించడం కోసం పెద్ద పోరాటమే చేసింది. విజిత్‌కి మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. కెరీర్ గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఇంట్లోవారి ఒత్తిడి మేరకు ఇంజినీరింగ్‌లో చేరిపోయాడు. అయితే విజిత్‌కి స్కూల్ రోజుల నుంచి ప్రకృతి మీద మక్కువ ఎక్కువ. పర్యావరణానికి సంబంధించిన క్యాంపులకు స్కూల్ తరఫున వెళ్లేవాడు.
దానితో కాలేజీలో చేరాక ఈ ఇష్టం రెట్టింపయ్యింది. స్నేహితులతో కలిసి మొక్కలు నాటేవాడు, కాలేజీ క్యాంపస్‌లో కూడా మొక్కలకు అంట్లు కట్టేవాడు. ‘‘నేను నా జీవితంలో ఇద్దరిని ఎన్నటికీ మరచిపోలేను. శివప్రసాద్ సర్, మోహన్‌కుమార్ సర్. వీరిద్దరూ ఇప్పుడు లేరు. పర్యావరణ గురించి వారిద్దరూ మాకు బాగా అర్థమయ్యేలా చెప్పేవారు. వారి కారణంగా ఈ అంశంలో ఎన్నో విశేషాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చదివాను. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి వారే కారణం’’ అంటాడు విజిత్.
తొలి పరిచయం
క్యాంపులు జరుగుతున్న సమయంలోనే విజిత్, వాణిలు మొదటిసారిగా కలుసుకున్నారు. ఒక ప్రత్యేక కారణంగా ఇద్దరూ టచ్‌లో ఉండేవారు. మొక్కలు నాటే సమయం, విత్తనాలు నాటడం, అంట్లు కట్టడం సమయాలలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంతో పాటు అనుబంధం ఏర్పడింది. ‘‘ఈ సందర్భంగానే వాణి నాకు చేరువైంది. చాలా చోట్ల ఇద్దరం కలిసి మొక్కలకు అంట్లు కట్టేవాళ్లం’’ అని గుర్తు చేసుకుంటాడు విజిత్. ఆ తర్వాత వాణి బి.ఎస్. (అగ్రికల్చర్) పూర్తి చేసింది త్రిచూర్‌లోని వాటర్‌షెడ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఉద్యోగం వచ్చింది. విజిత్ అదానీలోని ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా చేరాడు.
తరచుగా వారు క్యాంపులలో కలుస్తుండడం వల్ల వాళ్ల బంధం పటిష్టమయింది. వాణి విజిత్‌లు పాండిచేరి విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్‌సి. ఇకాలజీ చేయాలనుకున్నారు. ‘‘అయితే అనుకోకుండా వాణి తండ్రికి అనారోగ్యం చేయడంతో.. వాణి కాలేజీ మానేసి.. తల్లిదండ్రులను, నాయనమ్మను చూసుకోవాలసి వచ్చింది. వాణి కుటుంబంలో అందరికీ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే కాదు ఆయుర్వేద మూలికల గురించి కూడా తెలుసు. అందువల్ల వారికి సేవలు చేస్తూనే ఆమె తమ సొంత పొలంలోనే వ్యవసాయం చేయడం ప్రారంభించింది’’ అని తెలిపాడు విజిత్. వాణితో పాటు అతడు కూడా ఆ కోర్సుకి స్వస్తి పలికాడు.
ఉమ్మడి వ్యవసాయం
ఈ క్రమంలో కొందరు స్నేహితులతో కలిసి, నాలుగు ఎకరాల పొలంలో ఇద్దరూ వ్యవసాయం ప్రారంభించారు. వాణి వ్యవసాయ సలహాలు ఇచ్చేది. ‘‘ఇది నా జీవితానికి నాంది. వ్యవసాయం పట్ల నేను అంకితభావంతో పనిచేయడానికి తొలి అడుగు పడింది. కాలేజీ రోజులలో చేసిన విధంగానే మొక్కలు నాటటం ప్రారంభించాం’’ అంటాడు విజిత్. ఇద్దరూ సేంద్రియ ఎరువులతో, పర్యావరణ హాని జరగకుండా వ్యవసాయం చేశారు. ఇరుగుపొరుగు వారు రసాయన ఎరువులు వాడి పంట నష్టపోయారు.
కానీ వీరి పంట మాత్రం కళకళలాడింది. పురుగు పట్టకుండా సహజ ఎరువులు ఉపయోగించారు. హైబ్రీడ్ విత్తనాలు కాకుండా సహజ విత్తనాలు ఉపయోగించి బెండ, బీన్స్, కంద, వంగ, అరటి, మామిడి వంటి రకరకాల పంటలు పండించారు. మొత్తం ఐదువేల చెట్లు మొక్కలను పెంచారు. అంతేకాదు వారి భూమిలోనే చిన్నచిన్నగా పది చెరువులు తవ్వించారు. ఇరుగుపొరుగు వారంతా వీరి దగ్గరే కూరగాయలు కొనడం ప్రారంభించారు. అంతేకాదు ఎవరికి కావలసినవి వారు కోసుకునే సౌకర్యం కల్పించారు వీరు.
సేంద్రియ సంప్రదాయం
అజిత్.. వాణితో అన్ని విషయాలు చర్చించేవారే కాని, ఏనాడూ వివాహం గురించి సీరియస్‌గా మాట్లాడుకోలేదు. వాణి స్వయంగా ప్రపోజ్ చేసినప్పుడు కానీ అతడు తన ప్రేమను వ్యక్తం చేసే సాహసం చేయలేకపోయాడు. అప్పుడే వివాహంతో పాటు, పెళ్లివిందు ఎలా ఏర్పాటు చేయాలా అని ఆలోచించారు. వారి ఆలోచన ఈ రోజుల్లో సాధారణమే కావచ్చు కాని, పది సంవత్సరాల క్రితం అది విలక్షణమైనదే. ఏమిటి విలక్షణం అంటే.. పెళ్లి పిలుపులు, పెళ్లి దుస్తులు, పెళ్లి పందిళ్లు, పెళ్లి వంటలు, పెళ్లి విందులు.. అన్నీ సహజమైన ప్రకృతి ఉత్పత్తులతో సంబంధం ఉండేలా చేయాలన్నది! అలాగే చేశారు అదర్శ దంపతులుగా నిలిచారు.
– జయంతి
Comments
Please login to add a commentAdd a comment