హోరాహోరీ
- ప్రధాన పార్టీల్లో రె‘బెల్స్’
- తిరుగు‘బాట’లో పలువురు
- భారీగా నామినేషన్లు
- కిటకిటలాడినరిటర్నింగ్ కేంద్రాలు
- కొన్నిచోట్ల ఉద్రిక్తతలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం రక్తి కడుతోంది. అభ్యర్థుల వెల్లడిలో జాప్యం.. పొత్తు కుదరని స్థానాలు.. రాత్రికి రాత్రి పార్టీ గోడలు దూకేసిన అభ్యర్థులు.. క్షణాల్లో రంగు మారిన కండువాలు.. ఎవరు ఏ టికెట్‌పై పోటీ చేస్తున్నారో తెలియక అయోమయం.. రెండు రోజులుగా సాగిన గందరగోళ పరిణామాల మధ్య బుధవారం గ్రేటర్ రాజకీయ ముఖచిత్రంలో ఎట్టకేలకు స్పష్టత ఏర్పడింది. అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ గట్టిగా మోగాయి. ప్రధాన పార్టీలన్నీ తిరుగుబాట్లకు ఎదురీదక తప్పని పరిస్థితి నెలకొంది. చివరి రోజైన బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
గడువు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉన్నా.. అప్పటిలోగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థులంతా నామినేషన్లు పూర్తిచేసేందుకు రాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అభ్యర్థుల అభిమానులు, అనుచరులతో ఆయా ప్రాంతాల్లో హడావుడి కనిపించింది. నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి టికెట్లు పొందిన వారు, రెబల్స్ అభ్యర్థులు పోటాపోటీగా తరలి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇది ఆవేశకావేశాలకు దారి తీసింది.
తిరుగు‘బాట’లో..
ఎల్‌బీనగర్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్.కృష్ణయ్యకు నామినేషన్ దాఖలు రోజునే గట్టి సెగ తగిలింది. ఎల్‌బీనగర్ టికెట్ ఆశించి భంగపడిన సామ రంగారెడ్డి అనుచరులు.. కృష్ణయ్య కారుపై కొబ్బరిబొండాలతో దాడి చేశారు. ‘కృష్ణయ్యా గోబ్యాక్’ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ నేత ఎస్వీ కృష్ణప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
గోషామహల్ బీజేపీ టికెట్ రాజాసింగ్‌కు దక్కడంతో.. ఆ టికెట్ ఆశించిన నందకిశోర్‌వ్యాస్, రఘునందన్‌యాదవ్, రామస్వామి, గోవింద్‌రాఠి రెబల్స్‌గా నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ మిత్రపక్ష టీడీపీ నుంచి శీలం సరస్వతి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ దక్కని ఆర్వీ మహేందర్‌కుమార్.. ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు.
సికింద్రాబాద్ టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరిన వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు చివరకు నిరాశే మిగలడంతో పెద్దసంఖ్యలో తన అనుచరులతో ఊరేగింపుగా వెళ్లి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గంపై ఎంతోకాలంగా ఆశలు పెంచుకున్న టీడీపీ నేతలు పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్‌యాదవ్ సైతం స్వతంత్రులుగా బరిలో దిగారు.
కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ లభించని శోభాకృష్ణ అక్కడ తిరుగుబావుటా ఎగురవేశారు.
ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ నుంచి బిఎన్‌రెడ్డి ప్రత్యర్థిగా పోటీకి దిగారు.
డాక్టర్ వినయ్‌కుమార్ (ముషీరాబాద్-కాంగ్రెస్) అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ బీసీ సెల్ నేత న గేష్ ముదిరాజ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్, ఎన్.దశరథ్ స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ లభించని హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీష్‌గౌడ్ ప్రత్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనకు గతంలో జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులిస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఏదీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో తనకు అసెంబ్లీ టికెట్ ఖాయమని ఆయననమ్మారు. అదీ దక్కకపోవడంతో తిరుగుబావుటా ఎగురవేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మొవ్వా సత్యనారాయణ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐ (అజీజ్‌పాషా)కి కేటాయించారు. మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం నామినేషన్ వేయడం విశేషం. ఇంకా, చల్లా నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి కాంగ్రెస్ రెబెల్స్‌గా బరిలో నిలిచారు.
అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రెబల్స్‌గా కాలేరు శ్రీనివాసరావు, అంగరెల్లి నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు.
మల్కాజిగిరి అసెంబ్లీ టీడీపీ రెబల్స్‌గా శారదామహేశ్, సుమలతారెడ్డి సవాల్ విసురుతున్నారు.
పటాన్‌చెరులో కాంగ్రెస్ రెబల్‌గా నగేశ్‌యాదవ్ బరిలో నిలిచారు.
అన్ని పార్టీల్లో స్వతంత్రుల హవా
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎంతో పాటు లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, బీఎస్‌పీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్, తెలంగాణ జాగిర్, జై సమైక్యాంధ్ర, టీఆర్‌ఎల్‌డీ, ఆర్‌ఎస్‌పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ లోక్‌సత్తా పార్టీల నుంచీ పెద్దసంఖ్యలో నామినేషన్లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీ గ్రేటర్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలో దింపింది. స్వతంత్ర అభ్యర్థులుగానూ పలువురు నామినేషన్లు వేశారు.
గోడ దూకిన వారికి టికెట్లు
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారి వెంటనే బీఫారాలు తెచ్చుకొని పోటీలో నిలిచిన వారూ తక్కువేం లేరు. టీడీపీకి చెందిన ముఠా గోపాల్, ప్రేంకుమార్‌దూత్, మురళిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరిలో మల్కాజిగిరి అసెంబ్లీని ఆశించిన మైనంపల్లి హన్మంతరావు, టీడీపీ నుంచి కాంగ్రెస్.. అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి ఏకంగా మల్కాజిగిరి ఎంపీగా నిలిచారు. మిగతా వారికీ పార్టీల మార్పుతో తాము కోరుకున్న అసెంబ్లీ స్థానాల టికెట్లు లభించాయి.