'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో తొలి విస్తరణలో స్థానం దక్కక పోయినా రెండోసారి విస్తరణలోనైనా చోటు దక్కుతుందని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భావించారు. కానీ సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో కొప్పుల ఈశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్... కేసీఆర్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
అయితే కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ పదవిని కేటాయించడంపై మాలమహానాడు కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చీఫ్ విప్ పదవి తీసుకోవద్దంటూ కరీంనగర్లోని కొప్పుల ఈశ్వర్ నివాసం వద్ద ఆదివారం మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈశ్వర్కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వద్దు ... 16వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో మీ వెన్నంటి ఉన్న తమ నాయకుడు ఈశ్వర్కు చీఫ్ విప్ పదవి ఇచ్చి అన్యాయం చేయొద్దని వారు సీఎం కేసీఆర్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కొప్పుల ఈశ్వర్ను కోరగా... అందుకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు.