
సాక్షి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన సాగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రుణమాఫీ చేయకుండా సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీని మోసం చేసినవాళ్లేనని విమర్శించారు. అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లానన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఒక సంవత్సరం నుంచి కొల్లాపూర్‌లో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీశారు.
తల్లిపాలు తాగి రొమ్ము విరిచినట్లుగా కాంగ్రెస్‌కు జూపల్లి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మోసం చేశారని మల్లు రవి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఏ నాయకుడికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీతో బీజేపీకి రహస్య ఒప్పందముందని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 20కి 20 వార్డులు గెలుచుకుని చైర్మన్‌ను కైవసం చేసుకుంటుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment