‘ఆమె కాని హేమ’కు నకిలీ విజయ్‌ ఆఫర్‌ | Man Arrest in Cyber Fraud Case Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆమె కాని హేమ’కు నకిలీ విజయ్‌ ఆఫర్‌

Published Sat, Mar 7 2020 7:30 AM | Last Updated on Sat, Mar 7 2020 8:20 AM

Man Arrest in Cyber Fraud Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండను అంటూ యూట్యూబ్‌లో తన నంబర్‌ ఇచ్చి, ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రంగంలోకి దిగి యువతులతో చాటింగ్‌ చేస్తూ వారిని చీటింగ్‌ చేసేందుకు ప్రయత్నించిన నిజామాబాద్‌ జిల్లా, మీర్జాపూర్‌ వాసి సాయికిరణ్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ వద్ద పని చేస్తున్న గోవింద్‌ అనే యువకుడిని నకిలీ హేమగా మార్చిన పోలీసులు సాయి కృష్ణతో చాటింగ్‌ చేయించారు. ఈ వల్లో పడిన సాయికృష్ణ ‘ఈ రాత్రికి డేటింగ్‌ చేద్దాం. రేపు ఉదయం పెళ్లి చేసుకుందాం’ అంటూ ‘హేమకు’ సమాచారం ఇచ్చి గురువారం రాత్రి సిటీకి చేరుకున్నాడు. ఎల్బీనగర్‌ ప్రాంతంలో వలపన్నిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మీర్జాపూర్‌కు చెందిన సాయికృష్ణ పదో తరగతి వరకు చదువుకున్నాడు. విజయ్‌ దేవరకొండకు యువతుల్లో ఉన్న క్రేజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని పథకం పన్నిన అతను తానే విజయ్‌ దేవరకొండ అంటూ యూబ్యూబ్‌ ఛానల్‌లో తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. సదరు సినీ నటుడి మాదిరిగా గొంతు మార్చి మాట్లాడటంలో పట్టు ఉండటం ఇతడికి కలిసి వచ్చింది. ఈ నంబర్‌ విజయ్‌ దేవరకొండకు చెందినదిగా భావించిన పలువురు యువతులు సాయికృష్ణతో వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేయడం, వాయిస్‌ కాల్స్‌ మాట్లాడటం చేశారు. కొన్ని రోజుల అనంతరం కలుద్దామంటూ వారు కోరేవారు. దీంతో తొలుత తనకు డబ్బింగ్‌ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్‌ చేయాలని, పూర్వాపరాలు పరిశీలించిన అతడు చేసే సిఫార్సు ఆధారంగా తాను అపాయింట్‌మెంట్‌ ఇస్తానంటూ చెప్పే ఈ నకిలీ విజయ్‌ దేవరకొండ తనకు చెందిన రెండో నంబర్‌ ఇచ్చేవాడు.

దీంతో ఆ యువతులు రెండో నంబర్‌లో వాట్సాప్‌ ద్వారా సంప్రదించగా సాయిగా పరిచయం చేసుకునేవాడు. విజయ్‌ దేవరకొండ మాదిరిగా ఇతడు మాట్లాడగలగటంతో అంతా ఇతడే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని నమ్మే వారు. కొందరితో తనను విజయ్‌ దేవరకొండ కజిన్‌ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విజయ్‌ దేవరకొండ దృష్టికి వెళ్ళింది. దీంతో అతడి సిబ్బంది మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. ఈ నకిలీ విజయ్‌ దేవరకొండను పట్టుకోవడానికి పోలీసులు ఓ నకిలీ హేమను రంగంలోకి దింపారు. విజయ్‌ దేవరకొండ కార్యాలయంలో పని చేసే గోవింద్‌ అనే యువకుడిని హేమ పేరుతో, ఇలాంటి ఫ్రొఫైల్స్‌తో కూడిన వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేయించారు. పూర్తిగా ఈ వల్లో పడిన  సాయి తనతో చాటింగ్‌ చేస్తున్నది యువతిగా భావించాడు. ఓ దశలో ‘నీ గొంతు వినాలని ఉంది’ అంటూ సాయి చెప్పడంతో... తన స్నేహితురాలైన యువతితో మాట్లాడించాడు. ఆ సందర్భంలో ఇతగాడు విజయ్‌ దేవరకొండ మారిగా డైలాగ్స్‌ కూడా చెప్పాడు.

ఈ వ్యవహారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వెళ్లడం, మంగళ–బుధవారాల్లో మీడియా, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడం... ఇవేవీ సాయికి పట్టలేదు. దీంతో నకిలీ హేమతో చాటింగ్స్‌ కొనసాగించాడు. గురువారం ఉదయం ‘నిన్ను కలవాలని ఉంది. ఈ రోజు హైదరాబాద్‌ వస్తా... రాత్రి డేటింగ్‌ చేసి రేపు ఉదయం పెళ్లి చేసుకుందాం’ అంటూ మెసేజ్‌ పంపాడు. దీనికి ఓకే అంటూ రిప్‌లై రావడంతో మీర్జాపూర్‌ నుంచి బయలుదేరాడు. నకిలీ హేమ తన నివాసం ఎల్బీనగర్‌ అని చెప్పడంతో గురువారం రాత్రి ఎల్పీటీ మార్కెట్‌ వద్దకు చేరుకున్న అతడి ఇంటికి రావడానికి క్యాబ్‌ బుక్‌ చేయన్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో కాపుకాసిన పోలీసులు తమ వాహనాన్నే క్యాబ్‌గా చెబుతూ ఆ ప్రాంతానికి వెళ్లారు. దగ్గరకు వచ్చిన సాయిని అదుపులోకి తీసుకుని లోపలికి ఎక్కించడానికి ప్రయత్నించగా దీనిని గుర్తించిన అతను తనను ఎవరో కిడ్నాప్‌ చేస్తున్నారంటూ హల్‌చల్‌ చేశాడు. అయినప్పటికే సాయిని అదుపులోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసుల స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మీర్జాపూర్‌లో ఇడ్లీ బండి నిర్వహిస్తున్న సాయికి తండ్రి లేడు. తల్లి కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమెకు ఇతడే ఆధారం. సాయిని నిందితుడి పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ ఊరి నుంచి వచ్చిన పెద్దలకు శుక్రవారం అతడిని అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement