మీరేమన్నా అంటే.. చచ్చిపోతా..!  | Man Blackmailing Police With Suicide Note At Tankbund Hyderabad | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 8:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Man Blackmailing Police With Suicide Note At Tankbund Hyderabad - Sakshi

హిమాయత్‌నగర్‌ : ‘ఓ వ్యక్తిపై యజమానురాలు ఇంటి అద్దె చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఆ వ్యక్తిని పోలీసులు పిలిచి మందలించారు. దీంతో ఆ వ్యక్తి ‘మీరేమన్నా అంటే.. నేను చచ్చిపోతా.. అంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ముగ్గురు క్యాబ్‌డ్రైవర్లు, ఐదారుగురు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్యక్తిని పిలిచి విచారించగా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా.. నన్ను పీఎస్‌కు పిలిచి మందలిస్తారా.. మీ పద్ధతి ఏం బాగోలేదు’ అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇదీ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారం. ఇది మీ పద్ధతి కాదు అని హెచ్చరించినందుకే వీరిద్దరూ పోలీసులపై తిరగబడి వింతగా ప్రవర్తిస్తున్నారు.  

నీ పేరు రాసి చచ్చిపోతా.. 
హైదర్‌గూడలో పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని ఓ వృద్ధురాలి ఇంట్లో ప్రకాశరావు అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నారు. జనవరిలో వృద్ధురాలి ఇంట్లో కి అద్దెకు దిగారు. అప్పటి నుంచి సరిగ్గా ఇంటి అద్దె కూడా ఇవ్వలేదు. అద్దెకు దిగేప్పుడు రూ.50 వేలకు ఓ చెక్కును ఇచ్చాడు. అసలు ఇతగాడికి బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేదు. వృద్ధురాలు అద్దె కావాలి అనడంతో అప్పుడప్పుడు రూ.2వేలు ఇచ్చేవాడు. ఈ విషయంపై వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పిలిచి మందలించారు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు ఇస్తావా..? అంటూ వృద్ధురాలిని వేధించడం మొదలు పెట్టాడు. 

ట్యాంక్‌బండ్‌పై సూసైడ్‌ స్లిప్‌తో..  
తన వేధింపులు భరించలేకపోతున్నా అంటూ వృద్ధురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మళ్లీ ఆ వ్యక్తిని పీఎస్‌కి పిలిపించారు. పద్ధతి మార్చుకుని ఆమెకు అద్దె డబ్బులు ఇవ్వాలని చెప్పారు. దీంతో ‘మీరేమన్నా అంటే నేను చచ్చిపోతా’ అంటూ పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ‘నన్ను నారాయణగూడ పోలీసులు వేధిస్తున్నారు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోతా’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసుకుని లేక్‌పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా తిరుగుతున్నాడు. అనుమానం వచ్చిన లేక్‌ పోలీసులు ఓ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఉన్నతాధికారిని కలిసి సూసైడ్‌ నోట్‌ చూపించాడు. విషయం గురించి ఉన్నతాధికారి నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ బండారి రవీందర్‌కు ఫోన్‌ చేసి అడగడంతో ఇతడి లీలలు వివరించారు. దీంతో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ వద్దకు పంపారు. ఇది సివిల్‌ మ్యాటర్‌ దీనిలో ఇన్‌వాల్వ్‌ అవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను నన్ను వేధిస్తున్నారంటూ వారిపై కేసు వేయాలని లాయర్‌ను కూడా సంప్రదించాడు.  

క్యాబ్, ఫుడ్‌ఆర్డర్‌ డబ్బులు ఎగ్గొట్టాడు 
నారాయణగూడ పీఎస్‌ పరిధిలోని బర్కత్‌పుర సిగ్నల్‌ వద్ద ఓ ఇంట్లో చంద్రశేఖర్‌ భార్యతో కలిసి ఉంటున్నాడు. పనుల నిమిత్తం పలుమార్లు ఓలా, ఊబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకొని పని నిమిత్తం నగరంలోని పలు ప్రాంతాలకు తిరిగి ఇంటికి చేరతాడు. పర్సులో డబ్బులు సరిపడా లేవు తీసుకొస్తా అని ఇంటిపైకి వెళ్తాడు. మళ్లీ బయటకు రాడు. నచ్చిన ఫుడ్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి పార్సిల్‌ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. డెలవరీ బాయ్‌ ఎంతసేపు పిలిచినా స్పందన ఉండదు. పలుమార్లు కాలింగ్‌ బెల్‌ కొడితే భార్య బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేరు అని చెబుతుంది. దీంతో క్యాబ్‌డ్రైవర్లు, ఫుడ్‌డెలివరీ బాయ్స్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మీరిలా నన్ను నిందించడం సరికాదు 
క్యాబ్‌ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని పీఎస్‌కు పిలిపించి విచారించారు. నేను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదంటూ బదులిచ్చాడు. దీంతో పోలీసులు మందలించడంతో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా..? పీఎస్‌కు పిలిపించి నిందించడం సరికాదు’ అంటూ పోలీసులపైనే ఎదురు దాడికి దిగడంతో అందరూ అవాక్కయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement