ఆర్మూర్ (నిజామాబాద్) : ఏటీఎంల వద్దకు నగదు డ్రా చేసేందుకు వచ్చే వినియోగదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి శనివారం పోలీసులకు చిక్కాడు. ఏటీఎంల వద్ద కాపుకాచి, కార్డు వినియోగించటం తెలియని వారికి సాయం చేస్తానంటూ ముందుకు వస్తాడు. తిరిగి కార్డును వారికిచ్చే సమయంలో తనవద్ద ఉన్న నకిలీ కార్డును అంటగడతాడు. అనంతరం అసలు కార్డుతో డబ్బులు డ్రా చేసుకుంటాడు.
వివరాల్లోకి వెళ్తే... బాల్కొండ మండలం దూద్‌గాం గ్రామానికి చెందిన సయ్యద్ షాలీ బాషా ఆటో డ్రైవర్. సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలకు అలవాటుపడ్డాడు. ఏప్రిల్ 16వ తేదీన బాల్కొండ ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన రాజాసాబ్ అనే వ్యాపారిని బాషా మాటల్లోకి దింపాడు. సాయం చేస్తానంటూ నమ్మబలికి అతడి ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేసి, తనవద్ద ఉన్న నకిలీ కార్డును అంటగట్టాడు. అనంతరం అసలు కార్డును వినియోగించి రూ.19,500 డ్రా చేసుకున్నాడు. అలాగే ఏప్రిల్ 20వ తేదీన పెర్కిట్‌కు చెందిన సయ్యద్ యూసఫ్ అలీ అనే వ్యక్తిని బురిడీ కొట్టించి అతని కార్డుతో రూ.80వేలు కాజేశాడు. వీటిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు శనివారం అతడిని పట్టుకున్నారు. రూ.65వేలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
నకిలీ ఏటీఎం కార్డులతో మోసం
Published Sun, Apr 26 2015 9:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement