Fake ATM cards
-
పుదుచ్చేరిలో నకిలీ ఏటీఎం ముఠా అరెస్ట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి కేంద్రంగా నకిలీ ఏటీఎం కార్డుల్ని తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా సామాన్యుల నుంచి కొల్లగొట్టిన మొత్తం రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ముఠాలో పుదుచ్చేరికి చెందిన ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే నేతలు ఉండటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కేరళలోని ఓ పబ్‌లో గతవారం చోటుచేసుకున్న ఓ గొడవలో పుదుచ్చేరికి చెందిన ఓ యువకుడి వద్ద భారీ సంఖ్యలో నకిలీ ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. దీంతో పుదుచ్చేరి పోలీసుల సహకారంతో కేరళ పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. అనంతరం ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగి జయచంద్రన్, డా.ఆనంద్, చెన్నైకు చెందిన శ్యామ్, కమల్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత సత్య, అన్నాడీఎంకే నేత చంద్రోజీలు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాల సాయంతో బ్యాంక్ ఖాతాల్లోని నంబర్లను ట్రాప్‌చేసి నకిలీ ఏటీఎం కార్డుల్ని సృష్టించేవారని పోలీసులు తెలిపారు. అలాగే స్వైపింగ్ యంత్రాలు వాడే షాపు యజమానులతో చేతులు కలిపి ఖాతాదారుల వివరాలు తస్కరించేవారని, ఇందుకోసం 10 శాతం కమీషన్లు ఇచ్చేవారన్నారు. -
నకిలీ ఏటీఎం కార్డులతో మోసం
ఆర్మూర్ (నిజామాబాద్) : ఏటీఎంల వద్దకు నగదు డ్రా చేసేందుకు వచ్చే వినియోగదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి శనివారం పోలీసులకు చిక్కాడు. ఏటీఎంల వద్ద కాపుకాచి, కార్డు వినియోగించటం తెలియని వారికి సాయం చేస్తానంటూ ముందుకు వస్తాడు. తిరిగి కార్డును వారికిచ్చే సమయంలో తనవద్ద ఉన్న నకిలీ కార్డును అంటగడతాడు. అనంతరం అసలు కార్డుతో డబ్బులు డ్రా చేసుకుంటాడు. వివరాల్లోకి వెళ్తే... బాల్కొండ మండలం దూద్గాం గ్రామానికి చెందిన సయ్యద్ షాలీ బాషా ఆటో డ్రైవర్. సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలకు అలవాటుపడ్డాడు. ఏప్రిల్ 16వ తేదీన బాల్కొండ ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన రాజాసాబ్ అనే వ్యాపారిని బాషా మాటల్లోకి దింపాడు. సాయం చేస్తానంటూ నమ్మబలికి అతడి ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేసి, తనవద్ద ఉన్న నకిలీ కార్డును అంటగట్టాడు. అనంతరం అసలు కార్డును వినియోగించి రూ.19,500 డ్రా చేసుకున్నాడు. అలాగే ఏప్రిల్ 20వ తేదీన పెర్కిట్‌కు చెందిన సయ్యద్ యూసఫ్ అలీ అనే వ్యక్తిని బురిడీ కొట్టించి అతని కార్డుతో రూ.80వేలు కాజేశాడు. వీటిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు శనివారం అతడిని పట్టుకున్నారు. రూ.65వేలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ ఏటీఎం కార్డులతో రూ.50 కోట్ల లూటీ
మల్కన్‌గిరి (ఒడిశా) న్యూస్‌లైన్ : నకిలీ ఏటీఎం కార్డుల సాయంతో ఏటీఎంలను కొల్లగొడుతున్న 9 మంది సభ్యుల దొంగల ముఠాను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లాప్‌టాప్‌లు, మూడు డేటా కార్డులు, నాలుగు సెల్ఫోన్లు, 50 సిమ్‌కార్డులు, వివిధ బ్యాంకుల పేరుతో ఉన్న నకిలీ ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఈ ముఠా సభ్యులు 2006 నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి, గజపతి, కోరాపుట్, కేంద్రపడా, కటక్, బాలసోర్, రాయగడ, నబరంగపుర్ ప్రాంతాలతోపాటు ఢిల్లీ, బరోడాలలోని ఏటీఎంల నుంచి సుమారు రూ.50 కోట్లను స్వాహా చేసినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్సింగ్ శుక్రవారం చెప్పారు.