ప్లాస్టిక్‌గా మారిన పాలను చూపిస్తున్న అస్లామ్
ఉడికిస్తే పాలు ప్లాస్టిక్ పదార్థంగా తయారైంది. లాగితే సాగుతోంది. భూమికి కొడితే బంతిలా లేచింది. దీంతో అందోళన చెందిన వినియోగదారులు కల్తీ పాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
బాన్సువాడ: పాలను ఉడికిస్తే ప్లాస్టిక్ పదార్థంలా మారి నేలకేసి కొడితే బంతిలా ఎగరడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బుధవారం ఈ చోద్యం చోటుచేసుకుంది. స్థానిక రాజారాం దుబ్బలో నివాసం ఉండే అస్లామ్ ఓల్డ్‌బాన్సువాడలో గల పాల కేంద్రం నుంచి లీటర్ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వేడి చేయగా అవి పగిలిపోయాయి. అయితే పగిలిపోయిన పాలను వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామనే ఉద్దేశంతో మరిగించగా ఆ పాలు కాస్త ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి.
ఆ ముద్దను ఎంత లాగినా ప్లాస్టిక్ లాగే ఉండడం, తినడానికి ప్రయత్నిస్తే ప్లాస్టిక్ వాసన రావడంతో అవాక్కయ్యారు. దీంతో ఆందోళన చెందిన అతను బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన డీఎస్పీ, అదే పాలకేంద్రం నుంచి మరో లీటర్ పాలను తీసుకువచ్చి ఆ పాలను పగిలిపోయేలా చేసి వేడి చేయగా, అది కూడా ప్లాస్టిక్ ముద్దలా తయారైంది. దీంతో పాలలో రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసి, ఆ పాల కేంద్రాన్ని సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. లీటర్‌కు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న ఆ పాలలో రసాయనాలు కలిపి చిక్కగా మారే విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు.
పాలలో రసాయనాలు కలపడం వల్ల అది కల్తీ అయి, ప్లాస్టిక్‌గా మారుతోంది. స్వయాన పరిశీలించాను. పెరుగు కూడా ప్లాస్టిక్‌గా తయారవుతోంది. దీనిపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సమగ్ర విచారణ చేస్తారు. ఆయనకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, శాంపిల్స్‌ను సేకరిస్తారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటాం. – దామోదర్‌రెడ్డి, డీఎస్పీ
పాలను వేడి చేస్తే ప్లాస్టిక్‌గా మారింది
పాల కేంద్రం నుంచి నేను లీటర్ పాలను ఇంటికి తీసుకెళ్లాను. అవి పగిలిపోయాయి. వేడి చేసి చక్కెర కలిపి పిల్లలకు ఇద్దామనుకున్నాం. వేడి చేయగా అవి పూర్తిగా ప్లాస్టిక్‌లా మారింది. దాన్ని ముద్ద చేస్తే ప్లాస్టిక్ బంతిలా తయారైంది. వెంటనే డీఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాను.–అస్లామ్, పాలను కొనుగోలు చేసిన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment