నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
విచారణ జరపాలంటూ డీజీపీకి మల్‌రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలసి పలు పత్రాలను అందజేశారు. మంచిరెడ్డి ఏడేళ్లుగా నయీమ్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దళిత, గిరిజన రైతులను బెదిరిం చారని... కోట్ల విలువైన భూములను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించారని ఆరోపించారు. రియల్ వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేశాడన్నా రు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూములు కొన్నా, అమ్మినా మంచిరెడ్డికి తెలియకుండా జరగడానికి వీల్లేని విధంగా భయానక వాతావరణాన్ని నయీమ్ సృష్టించాడని ఆరోపించారు. ఆదిభట్లలో మంచి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌లో ఉన్న 36.10 ఎకరాలను మంచిరెడ్డి, ఆయన అనుచరులు రైతులను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారని.. తట్టిఖానా రెవెన్యూ పరిధిలో 325 ఎకరాల భూమిని పేదల నుంచి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారన్నారు. మంచిరెడ్డి, నయీమ్ అకృత్యాలు, కబ్జాలపై సిట్‌తో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదిభట్లలోని మంచి ఇన్‌ఫ్రా డెవలపర్స్ డాక్యుమెంట్, నయీమ్, రాంరెడ్డి పట్వారీ కుమారుడు నర్సింహరెడ్డి డాక్యుమెంట్, ఖానాపూర్ 67/ఇ లోని నకిలీ పాస్‌బుక్ , ప్రొసీడింగ్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రం కాపీలను డీజీపీకి ఇచ్చినట్లు మల్‌రెడ్డి తెలిపారు.