సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోలీస్, మావోయిస్టుల మధ్య సరిహద్దుల్లోని ఆదివాసీలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు గిరిజన యువకులను ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తుంటే..మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు గిరిజన గూడేలపై విరుచుకుపడుతున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం..వదలమంటే పాముకు కోపం’ అనేచందంగా గిరిజనుల పరిస్థితి తయారైంది.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంపై పట్టు సాధించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా..వారి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య గిరిజనం నలిగిపోతున్నారు. మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ఉద్యుక్తులవుతుండగా.. అదేస్థాయిలో భద్రాచలం అటవీ ప్రాంతంపై పట్టు సాధించేందుకు మావోయిస్టులు కాలుదువ్వుతున్నారు. అటు మావోలు, ఇటు పోలీసుల చర్యలు అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.
గత 15 రోజులుగా అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారు. వాటిని తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివసించే గిరిజనుల కదలికలపై ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు నిఘా వేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్‌ఫార్మర్ నెపంతో రెండురోజుల క్రితం చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజనుడిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సోడె రాజును సోమవారం రాత్రి చింతూరు మండలం ఎదుర్లగూడెంలోని తన ఇంట్లో ఉండగా నలుగురు మావోయిస్టులు వచ్చి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతని కిడ్నాప్‌నకు కారణం ఏమై ఉంటుందనే విషయం గ్రామస్తులు సైతం చెప్పలేకపోతున్నారు.
గురువారం చర్ల మండలంలో మడకం తిరుపతి అనే మరో వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అతడిని హతమార్చి ఉంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే అందుకు తగిన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. దుమ్ముగూడెం మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మపేటలో నూతనంగా నిర్మిస్తున్న సీఆర్‌పీఎఫ్ బేస్‌క్యాంప్ కోసం ఇసుక తీసుకెళ్తున్న లారీని 15 రోజుల క్రితం మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ప్రాంతంలో తమకు పట్టు ఉందనే సంకేతాలను పోలీసులకు తెలిపే యత్నంలో భాగంగానే మావోయిస్టులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసు బలగాలు మోహరించిన ప్రాంతాల సమీపంలోనే మావోయిస్టులు విధ్వంసక చర్యలకు పాల్పడుతుండటం గమనార్హం. పోలీసులను కవ్వించే ప్రయత్నంలో భాగంగానే వారీ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు నిర్వహించిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో విధ్వంస చర్యలకు పాల్పడుతారన్న అనుమానంతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలో మావోయిస్టులు భారీ విధ్వంసాలకు పాల్పడకుండా పోలీసులు చేసిన కృషి కొంతమేర ఫలించినట్లయింది.
అయితే మావోయిస్టులు మాత్రం పోలీసులకు తమ సమాచారాన్ని అందజేస్తున్నారనే అనుమానంతో అమాయక గిరిజనులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తారా..? అంటూ పోలీసులు తమ గూడేలపై విరుచుపడుతున్నట్లు ఆదివాసీలూ ఆరోపిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టులు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల సమీపంలో చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేయటం, బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీటికి ఆ ప్రాంత గిరిజనం సహకారం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా అటు మావోలు, పోలీసుల మధ్య గిరిజనం బలైపోతున్నారు.
మన్యం దడదడ
Published Fri, Dec 12 2014 3:05 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement