వరంగల్ జిల్లా పోలీసుల ఎదుట బైరబోయిన భిక్షపతి(30) అలియాస్ కిరణ్, పడా రుక్మిణి(25) అలియాస్ సునీత అనే మావోయిస్టు దంపతులు మంగళవారం లొంగిపోయారు.
బైరబోయిన భిక్షపతి(30) అలియాస్ కిరణ్, పడా రుక్మిణి(25) అలియాస్ సునీత అనే మావోయిస్టు దంపతులు వరంగల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇద్దరూ దండకారణ్య దళ కమిటీ సభ్యులుగా పనిచేశారు. పీపుల్స్‌వార్ గ్రూపు దళ కమాండర్ పోలమ్ సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కే, భారతక్క, లతక్కల ప్రోత్సాహంతో 2001లో పరకాల దళంలో చేరారు. 2002లో భిక్షపతిని దళ సభ్యుడిగా గుర్తించిన ఆర్కే.. అతడిని తన గన్‌మాన్‌గా నియమించుకున్నారు. భిక్షపతి 2007లో లొంగిపోయి మళ్లీ 2008లో మావోయిస్టుల్లో చేరాడు.
భిక్షపతిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. అతని భార్య రుక్మిణిపై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. లక్ష రివార్డు ప్రకటించింది. మావోయిస్టు అధినాయకత్వం వైఖరి నచ్చకపోవడం వల్ల, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడినైన కారణంగా లొంగిపోతున్నట్లు బిక్షపతి ప్రకటించాడు. ప్రభుత్వం తక్షణ సాయం కింద లొంగిపోయిన మావోయిస్టులిద్దరికి చెరో రూ. 5వేలు సాయం అందించింది.