సంఘటనా స్థలంలో లభించిన తూటాలు
చర్ల (భద్రాచలం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు గ్రామాలు శనివారం పోలీసులు–మావోయిస్టుల ఎదురుకాల్పులతో అట్టుడికాయి. గంటపాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా సాగిన కాల్పులతో ఆదివాసీలు పరుగున ఇళ్లల్లోకి వెళ్లి ప్రాణాలను దక్కించుకున్నారు. పలు ఇళ్ల పైకప్పులకు తూటాలు తగిలి సిమెంటు రేకులు, పెంకులు పగిలాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం తోగ్గూడెం– చర్ల మండలం తిప్పాపు రం గ్రామాల మధ్య వేసిన రోడ్డును తనిఖీ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి సుమారు 300 మంది మావోయిస్టులు చర్ల మండలంలోని ఎర్రంపాడు, గోరుకొండ గ్రామాల మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి పోలీసు బలగాలు తారసపడగా మావోయిస్టులు మొదట కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులూ ఎదురుకాల్పులకు దిగారు. దీంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే గోరుకొండ మీదుగా ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి పారిపోయారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో గోరుకొండ గ్రామానికి చెందిన శ్యామల మంగయ్య, వెట్టి కేశ, కొవ్వాసి బీమె ఇళ్ల పైకప్పులకు తూటాలు తగిలి రేకులు, పెంకులు పగిలిపోయాయి. కాల్పుల శబ్దాలకు గోరుకొండ, తిప్పాపురం గ్రామాలకు చెందిన ఆదివాసీలు భయంతో ఇళ్లలో తలుపులు వేసుకొని రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 200 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని వారు తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు ‘రండిరా.. మీరో మేమో తేల్చుకుందాం’అని పోలీసులకు సవాల్ విసిరారని, పోలీసులు ‘ఫైర్.. ఫైర్’అంటూ అరిచారని గ్రామస్తులు తెలిపారు.
చర్ల మండలం కలివేరు సీఆర్‌పీఎఫ్ 151 బెటాలియన్ బలగాలు హుటాహుటిన తిప్పాపురం తరలివెళ్లాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులకు తీవ్ర గాయాలు కాగా, వీరేందర్‌సలాం అనే హెడ్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మావోయిస్టులను సహచరులు భుజాలపై ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment