సాక్షి, కొత్తగూడెం : విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని చూసేందుకు కుటుంబమంతా కలిసి వెళ్లారు.. ఎన్నో జ్ఞాపకాలను.. మధుర క్షణాలను మూటగట్టుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకోవచ్చు ఆలోపే రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ భీతావహ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు కాగా, మృతుల్లో భార్య, భర్త ఉన్నారు. ఇక మరో దంపతుల్లో భార్య చనిపోగా.. భర్త మృత్యువుతో పోరాడుతున్నారు. టూటౌన్ సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగూడెం పట్టణ పరి«ధిలోని బర్లిఫిట్‌కు సమీపంలో గల ఝాన్సీ ఆసుపత్రిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పాలపర్తి రమేష్ (40) పెద్దకూతురు పూజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆదివారం కావడంతో పర్లపల్లి రమేష్, అతని భార్య ప్రశాంతి (34), సోదరుడు సురేష్ , సోదరుని భార్య సుజాత (38), చిన్న కూతురు లిఖితతో కలిసి విజయవాడలోని కూతురు పూజను చూసేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు పూజతో అందరూ కలిసి సరదాగా గడిపారు. అనంతరం కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
ఈక్రమంలో చుంచుపల్లి మండలంలోని పెనగడప సమీపానికి రాగానే కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి వెళ్లుతున్న బొగ్గు టిప్పర్ ఎదురుగా వచ్చి కారును ఢీ కొంది. దీంతో కారు కొంతదూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో కారు నడుపుతున్న పర్లపెల్లి రమేష్, అతని సోదరుని భార్య సుజాత అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రమేష్ భార్య ప్రశాంతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. రమేష్ సోదరుడు సురేష్, కూతురు నిఖితలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికుల సాయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. బర్లిఫిట్ సమీపంలోని శశ్మానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇంటికి చేరేలోపే..
సుమారు 160 కిలోమీటర్ల దూరం సురక్షితంగా ప్రయాణించిన రమేష్ కుటుంబ సభ్యులు మరో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొత్తగూడెంలోని ఇంటికి చేరుకునేవారు. ఆ లోపే మృత్యువు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కబళించింది. అర్ధరాత్రి 11.40 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పెనగడప గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రమత్తులో నుంచి వారు తేరుకొని లేచి చూసేసరికి కారు నుజ్జునుజ్జకావటం, కళ్లెదుట రెండు మృతదేహాలు పడి ఉండటం చూసి భయబ్రాంతులకు గురయ్యారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ప్రమాద స్థలాన్ని కొత్తగూడెం డిఎస్పీ ఎస్ ఎం అలీ సోమవారం పరిశీలించారు. ప్రమాద వివరాలను సీఐ తుమ్మా గోపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయించారు. రోడ్డుకు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తీయించమని నేషనల్ హైవే అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment