![Married Women Suicide Attempt In Front Of Panjagutta Police Station - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/1/Panjagutta.jpg.webp?itok=AT5kmnfS)
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ గేటు ముందే అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన సానం లోకేశ్వరికి (37) అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో 2000లో పెళ్లి జరిగింది. కూతురికి 8 నెలల వయసు ఉన్నప్పుడే భార్యాభర్తలు విడిపోయారు. 2012లో లోకేశ్వరికి వారాసిగూడకు చెందిన ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు.
2013లో లోకేశ్వరిని ప్రవీణ్ నగరానికి తీసుకువచ్చి బీఎస్ మక్తాలో ఓ గదిలో ఉంచి సహజీవనం చేశాడు. ఇద్దరూ కలిసి సోమాజిగూడలోని బాబూఖాన్ ఎస్టేట్‌లో బీఎస్‌పీ జువెలర్స్ పేరుతో ఓ నగల దుకాణం తెరిచారు. లోకేశ్వరి దుకాణం నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసింది. 2014లో లోకేశ్వరిపై ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లోకేశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు.. 23 తులాల ఆభరణాలను రీకవరీ చేశారు.
2014 డిసెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన లోకేశ్వరి తిరిగి చెన్నై వెళ్లిపోయింది. కాగా, గత శుక్రవారం తన స్నేహితుడు కన్నన్‌తో కలిసి లోకేశ్వరి హైదరాబాద్‌కు వచ్చింది. ప్రవీణ్ తనను మోసం చేసి రూ.కోటి తీసుకున్నాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు లోకేశ్వరి తెలిపినట్లు సమాచారం. ప్రమాదంలో లోకేశ్వరి శరీరం 70 శాతం మేర కాలిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment