- షార్ట్ సర్క్యూట్‌తో ఘటన
- రూ. కోటి సొత్తు బుగ్గిపాలు
- సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది
- మేడ్చల్ పారిశ్రామికవాడలో ప్రమాదం
ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
Published Sun, Mar 22 2015 9:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
మేడ్చల్:
ఓ ఆయిల్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. రూ. కోటి విలువైన సొత్తు నష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్ పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. కంపెనీ ఎండీ యాకుబ్ అలీ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యాకుబ్‌అలీ ఇద్దరు భాగస్వామ్యులతో కలిసి మేడ్చల్ పారిశ్రామికవాడలో సుప్రీం లూబ్రికెంట్స్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. పెద్దపెద్ద మోటార్లు, వాహనాల్లో ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్‌ను సేకరించి ఈ కంపెనీలో రీసైక్లింగ్ చేసి తిరిగి విక్రయిస్తుంటారు. శనివారం ఉగాది పర్వదినం నేపథ్యంలో పరిశ్రమకు సెలవు ఉంది. కంపెనీకి కాపలాగా సెక్యూరిటీగార్డు సంజీవరెడ్డి మరో ఇద్దరు కార్మికులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శశాంక్‌రెడ్డి నగరంలోని జీడిమెట్లలో ఉన్న ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో అరగంటలోపు రెండు ఫైరింజన్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు గంటన్నరసేపు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్‌ఇంజన్‌లలో నీరు సరిపోకపోవడంతో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి ఎం.సురేష్ తన ట్రాక్టర్ల ద్వారా నీటిని సకాలంలో సరఫరా చేశాడు. కంపెనీలో బాయిలర్‌లోకి మంటలు చెలరేగడంతో పరిశ్రమ బయటకు మంటలు చిమ్మాయి. ప్రమాదంలో కంపెనీ షెడ్డు, రీసైక్లింగ్ పరికరాలు, ఆయిల్ పూర్తిగా కాలిపోయాయి.
షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం..
కంపెనీలో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ ఎండీ యాకుబ్ అలీ, పోలీసులు నిర్ధారించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్, సీఐ శశాంక్‌రెడ్డి ఎస్‌ఐలు రాములు, గోపరాజు పరిస్థితిని సమీక్షించారు. రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement