
మౌనిక్ మాయాజాలం
- కొలంబోలోనే దినేష్ శవాన్ని మాయం చేసేందుకు కుట్ర
- వెంకటేశంను బంధువుగా చూపించి శవాన్ని స్వాధీనం చేసుకునే యత్నం
- మార్చురీ వర్గాలు పాస్‌పోర్టు జిరాక్స్ అడగడంతో పారని పాచిక
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ ముఠా ఎంతకైనా తెగిస్తుందని మరోసారి స్పష్టమైంది. కిడ్నీ అమ్మేందుకు శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన కొత్తగూడెం వాసి దినేష్‌కుమార్ (26) మృతదేహం మాయం చేయడానికి కిడ్నీ ముఠా ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆసుపత్రి వర్గా లు పాస్ట్‌పోర్టు జిరాక్స్‌లు ఆడగడంతో ఈ కుట్న భగ్నమైంది.
ఆరోజు ఏం జరిగింది...
గతనెల 28న సాయంత్రం 4 గంటలకు దినేష్ కొలంబో బీచ్‌లో మద్యం, సిగరేట్లు విపరీతంగా తాగాడు. దీంతో గుండెపోటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. 15 నిముషాలలో మృతదేహం కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి చేరింది. కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి అయిన అక్కడి డాక్టర్ మౌనిక్ వెంటనే ఈ విషయాన్ని నల్లగొండ చిట్యాలలో ఉన్న కిడ్నీ రాకెట్ ఏజెంట్ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశం సెల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కొలంబోకు వచ్చి దినేష్ మృతదేహం స్వాధీనం చేసుకోవాలని కోరాడు.
ఈ విషయాన్ని వెంకటేశం దినేష్ కుటుంబ సభ్యులకుగానీ, ఇతరులకుగానీ తెలియకుండా గోప్యంగా ఉంచాడు. హుటాహుటిన నల్లగొండ నుంచి బయలుదేరి మరుసటి రోజు (29వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు కొలంబోలోని ఆసుపత్రికి చేరుకొనిమౌనిక్‌కు ఫోన్ చేశాడు. తాను దూర ప్రాంతంలో ఉన్నానని... రేపు వచ్చి కలుస్తానని మౌనిక్ చెప్పడంతో వెంకటేశం లాడ్జిలో మకాం వేశాడు. మరుసటి రోజు (30న) ఉదయం ఇద్దరూ కలుసుకున్నారు.
మృతుడు దినేష్ బంధువునని మార్చురీలోని డాక్టర్లను నమ్మించి మృతదేహం స్వాధీనం చేసుకోవాలని, తర్వాత ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి చేతులు దులుపుకోవాలని పన్నాగం పన్నారు. ఇద్దరూ కలిసి మార్చురీకి వెళ్లారు. తాను దినేష్ బంధువునని వెంకటేశం అక్కడి డాక్టర్లకు పరిచయం చేసుకున్నాడు. అతనికి మృతదేహం అప్పగించేందుకు అంగీకరించిన డాక్టర్లు... వెంకటేశం పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని షరతు పెట్టారు.
దీంతో కంగారుపడ్డ వెంకటేశం, మౌనిక్‌లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. విషయం గమనించిన మార్చురీ సిబ్బంది పోలీసుల సహాయం తీసుకుని దినేష్ పాస్‌పోర్టులో ఉన్న అతని సోదరుడు గణేష్ సెల్‌కు అదే రోజు మధ్యాహ్నం సమాచారం అందించడంతో ఏప్రిల్ 3న దినేష్ మృతదేహం కుటుంబ సభ్యులకు అందింది. శవం మాయం చేయాలనే కుట్ర దాగి ఉన్నందునే వె ంకటేశం తన పాస్‌పోర్టు జిరాక్స్ కాపీని అక్కడి మార్చురీ వర్గాలకు ఇవ్వలేదు, అలాగే ఇక్కడి కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా చేరవేయలేదు.
విదేశాల్లో చనిపోతే...
ఏదైనా దేశంలో విదేశీయుడు చనిపోతే...అతను ఏ దేశస్తుడో తెలుసుకుని ఆ దేశ రాయభార కార్యాలయానికి అధికారులు సమాచారం చేరవేస్తారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకుగాని, వారుంటున్న ప్రాంత పోలీసులకు గాని సమాచారం చేరుతుంది. ఇదంతా కేవలం నాలుగైదు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే దినేష్ మృతి విషయంలో ఇవేమీ జరగలేదు.