
సాక్షి, హైదరాబాద్: సినిమా రంగంలోని 24 విభాగాల్లో పనిచేసే వారి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి మంగళవారం చిరంజీవి ఇంట్లో వారితో భేటీ అయ్యా రు. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలు తీరు తెన్నులపై చర్చించారు.
టికెట్ల ధరలను నిర్ణయించే విధానాన్ని సరళీకరించే విధానం ఉండాలని మంత్రిని కోరారు. చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. సినీ, టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు అందజేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సినీ కార్మికులకు వర్తింపచేయాలని, వారికి ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పలుమార్లు సినీ ప్రముఖులు, చిత్రపురి కాలనీ సభ్యులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల రెండో వారంలో మరోసారి సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రావు, నిర్మాత నిరంజన్‌రెడ్డి, కిషోర్‌బాబు పాల్గొన్నారు.
మంత్రి తలసానికి పుష్పగుచ్ఛం ఇస్తున్న నాగార్జున, చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment