సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పట్టణాలు, పల్లెలకే కాదు.. దండకారణ్యానికి పాకుతోంది. అడవుల్లో ఉండే మావోయిస్టుల్లోనూ కరోనా భయం పెరిగిపోతోంది. దళసభ్యులు కరోనా వ్యాధి బారిన పడితే.. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా మాత్రల కొనుగోలుపై దృష్టిపెట్టారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన దరిమిలా..పలువురు మావోయిస్టులు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పలువురు మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్ కోసం పలు సమావేశాలు నిర్వహించగా పోలీసులు భగ్నం చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. జనారణ్యంలో తిరిగిన పలువురు మావోయిస్టులు దండకారాణ్యానికి వెళ్లాక జబ్బుల బారిన పడుతుండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. దీంతో అది కరోనా కావొచ్చన్న అనుమానంతో మందులు తెప్పించుకుంటున్నారు. పలు మారుమూల ప్రాంతాల్లో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు కరోనా చికిత్సకు వాడే మందులను భారీగా కొనుగోలు చేస్తున్నారని, ఇలా సేకరించిన మందులు తెలంగాణతోపాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సీజనల్ వ్యాధులా.. కరోనానా?
ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ ప్రహార్ మొదలైంది. గోదావరిలో నీటి ప్రవాహలు పలు చోట్ల తగ్గడంతో మావోయిస్టులు పలువురు తెలంగాణలో తలదాచుకునేందుకు వచ్చారు. వారితోపాటు పలుయాక్షన్ టీములు వచ్చాయి. వారి కోసం పోలీసులు కూంబింగ్ జరిపారు. అదే సమయంలో లాక్‌డౌన్ తీవ్రతరం కావడం, జనాల కదలికలు పూర్తిగా ఆగిపోవడంతో మావోలూ ఆగిపోయారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం కొందరు రిక్రూట్‌మెంట్ కోసం పలువురిని కలిశారు. ఇలా కలిసిన వారిలో చాలామంది సభ్యులు ప్రస్తుతం జ్వరాల బారిన పడుతున్నారు. దీనికితోడు రుతుపవనాల వల్ల కురుస్తున్న వర్షాలతో జలుబు, దగ్గు, చలిజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులూ మొదలయ్యాయి. ఫలితంగా తమలోనూ కరోనా వచి్చందేమోనన్న ఆందోళన మావోయిస్టుల్లో మొదలైంది. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. అయితే, పరిశుభ్రత విషయంలో వీరికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. దోమలు, అపరిశుభ్ర వాతావరణం వీరి ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతోందని తెలిసింది.
అనుమానాస్పద వ్యక్తుల కారణంగానే..
ఆన్‌లైన్‌లో కరోనాకి వాడే మందుల వివరాలు లభ్యమవుతుండటంతో మావోయిస్టులు ముందు జాగ్రత్తగా ఆ మందులను సేకరిస్తున్నారు. సానుభూతిపరులు, కొరియర్ల ద్వారా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు జ్వరం కోసం పారాసిటమాల్‌తోపాటు, జింక్, విటమిన్–డీ. విటమిన్–సీ మాత్రలు, యాంటిబయాటిక్స్, యాంటి వైరల్ డ్రగ్స్‌ను కొనుగోలు చేయిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో ఉండే మావోలకు చేరుతున్నాయని సమాచారం. ఒక్కరి కోసం కాకుండా..ఎక్కువ మొత్తంలో కావడంతో ఆ సమాచారం పోలీసులకు వెళ్లింది. దీంతో వారంతా ఇప్పుడు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ఫార్మా డీలర్లపై నిఘా పెట్టారు.
కేంద్ర కమిటీ సభ్యుడి భార్యకు కరోనా
ఇటీవల గుండెపోటుతో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న భార్య సుమిత్రకు కరోనా సోకింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో ఆమెకు కరోనా వచ్చింది. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ ఓ లేఖ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమెను దళం నుంచి బయటికి పంపగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment