మన మెట్రో గురించి తెలుసుకోండి | Metro Rail opening ceremony was held on November 28 | Sakshi
Sakshi News home page

మెట్రోకు వేళాయెరా !

Published Sun, Oct 29 2017 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Metro Rail opening ceremony was held on November 28 - Sakshi

మెట్రో రైలు.. హైదరాబాదీల కలల ప్రాజెక్టు.. ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి నవంబర్‌ 28న ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును మియాపూర్‌ డిపోలో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మియాపూర్‌–అమీర్‌పేట్‌ (12 కి.మీ), నాగోల్‌–అమీర్‌పేట్‌ (18కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం 2–2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని అంచనా. మన పొరుగునే ఉన్న బెంగళూరు మహానగరంలోనూ మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు మెట్రో నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నగరంలోని మెట్రో స్టేషన్లు, ప్రయాణ, పార్కింగ్‌ చార్జీలు, మెట్రో మాల్స్, మెట్రో రైళ్ల ప్రత్యేకతలు, బెంగళూరు మెట్రో నేర్పుతోన్న పాఠాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం..            – ఏసిరెడ్డి రంగారెడ్డి

గ్రేటర్‌ మెట్రోలో రియల్టీ ప్రాజెక్టు భాగమే..
మెట్రో ప్రాజెక్టులో ప్రయాణీకుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం 45 శాతమే. మిగతా 50 శాతం రెవెన్యూకు రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల విలువైన స్థలాల్లో రాబోయే 10–15 ఏళ్లలో రూ.2,243 కోట్లతో వివిధ ప్రాంతాల్లో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011లో 18 చోట్ల మాల్స్‌ నిర్మించాలనుకున్నప్పటికీ ఇప్పటి వరకు నాలుగుచోట్లనే మాల్స్‌ నిర్మాణం చేపట్టారు.

డ్రైవర్‌ రహిత టెక్నాలజీ మన మెట్రో స్పెషల్‌..
గ్రేటర్‌ మెట్రో నిర్మాణంలో ప్రతీదీ విశేషమే. మెట్రో రైళ్లు డ్రైవర్‌ రహిత సాంకేతికత.. అంటే కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ(సీబీటీసీ) ఆధారంగా రాకపోకలు సాగించనున్నాయి. పేరుకు కోచ్‌లో డ్రైవర్‌ ఉన్నప్పటికీ వీరి పని స్టేషన్‌ రాగానే బోగీ డోర్లు మూసుకునే, తెరుచుకునే బటన్‌(ఆన్‌/ఆఫ్‌) నొక్కడమే. మొత్తం రైలు గమనం, రాకపోకలు, వేగం తదితర అంశాలను ఉప్పల్‌ మెట్రో డిపోలోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నియంత్రిస్తారు. మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే 57 మెట్రో రైళ్ల నియంత్రణ ఇక్కడి నుంచే జరుగుతుంది. మెట్రో డ్రైవర్లను లోకోపైలట్‌ అంటారు. వీరిలో 47 మంది మహిళలు కూడా ఉండడం విశేషం. వీరందరికీ శిక్షణ పూర్తయ్యింది.

ఆల్‌ ఇన్‌ వన్‌ ‘స్మార్ట్‌ కార్డ్‌’..
మెట్రో చార్జీలను ఇప్పటివరకు అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే కనీస చార్జీ రూ.10 నుంచి గరిష్ట చార్జీ రూ.60 వరకూ ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక బెంగళూరు, ఢిల్లీ మెట్రో రైళ్లలో మంత్లీ, ఇయర్లీ పాస్‌లు లేవు. స్మార్ట్‌ కార్డ్‌ వ్యవస్థ ఉంది. ఈ కార్డును ఒకసారి ఖరీదు చేసి ప్రతిసారీ రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణ టికెట్‌తో పోలిస్తే స్మార్ట్‌ కార్డు ద్వారా ప్రయాణిస్తే 15 శాతం రాయితీ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ కార్డుల విక్రయం, రీచార్జ్‌ రూపంలో ఢిల్లీ, నమ్మ మెట్రోకు భారీగా ఆదాయం సమకూరుతోంది. నగర మెట్రోలోనూ ఇదే తరహా స్మార్ట్‌ కార్డ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ స్మార్ట్‌ కార్డుతో మెట్రోతో పాటు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఓలా, ఉబర్‌ క్యాబ్‌ల్లో ప్రయాణించవచ్చు. మెట్రో మాల్స్, స్టేషన్లలో షాపింగ్‌ చేయవచ్చు. అయితే ఈ కార్డు విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు.

మెట్రో మాల్స్‌ అదుర్స్‌..
నవంబర్‌లో హైటెక్‌సిటీ, పంజాగుట్ట మెట్రో మాల్స్‌ ప్రారంభంకానున్నాయి. పంజాగుట్ట మాల్‌ను 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో వాణిజ్య స్థల విస్తీర్ణం 4.8 లక్షల చదరపు అడుగులు. హైటెక్‌సిటీ మాల్‌ను 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. దీనికి అద్దె ప్రతి చదరపు అడుగుకు స్టోర్‌ లేదా ఆఫీసు విస్తీర్ణం రకాన్ని బట్టి ప్రతీ నెలా రూ.75–రూ.150 చొప్పున ఎల్‌అండ్‌టీ సంస్థ వసూలు చేయనుంది. ఇక మూసారాంబాగ్‌లో 4 లక్షలు, ఎర్రమంజిల్‌లో 3.5 లక్షలు, రాయ దుర్గం లో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ నిర్మించనున్నారు. మూసారాంబాగ్, ఎర్రమంజిల్‌ మాల్స్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. రాయదుర్గం మాల్‌కు 
సమయం పట్టనుంది.

బెంగళూరు మెట్రో ఏంచెబుతోంది
- బెంగళూరు మెట్రో పొడవు 42.3 కిలోమీటర్లు. వ్యయం రూ.13,845 కోట్లు.
- పీక్‌ అవర్‌లో ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ట్రైన్, సాధారణ సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఓ ట్రైన్‌. టికెట్‌ కనిష్ట ధర రూ.10 కాగా.. గరిష్ట ధర రూ.60.
- మొత్తం 41 మెట్రో స్టేషన్లకుగానూ.. 30 స్టేషన్లలో ఫీడర్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బస్సుల సమయం, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ప్రజలకు సరిగా ఉపయోగపడటం లేదనే విమర్శ ఉంది.
- మెట్రో స్టేషన్లు, బస్‌స్టాండ్లు, మాల్స్‌తో స్కైవేల ద్వారా అనుసంధానం లేదు.
- అధికారుల అంచనా ప్రకారమే మెట్రో రూట్‌లో 6 లక్షల మంది ప్రతిరోజూ రాకపోకలు సాగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 3.5 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు.
- మొత్తం 42 స్టేషన్లకుగానూ 18 స్టేషన్లలో మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంది.
- మెట్రోల్లో మహిళలకు ప్రత్యేక బోగీలు లేవు.
- నెల వారీ పాసులు, స్టూడెంట్‌ పాసుల సౌకర్యం లేదు.
- 2013–14 ఏడాదికిగానూ బీఎంఆర్‌సీఎల్‌కు రూ.83.15 కోట్ల నష్టం వాటిల్లగా మెట్రో స్టేషన్లలోని కొంత భాగాన్ని షాపులకు అద్దెకివ్వడం వంటి చర్యలతో 2014–15లో ఈ మొత్తం రూ.33.12 కోట్లకు తగ్గింది. 2015–16లో తిరిగి రూ.341.56 కోట్ల నష్టం వాటిల్లగా, 2016–17 నాటికి ఇది రూ.457.88 కోట్లకు పెరిగింది.
- ప్రధానంగా విద్యుత్‌కు అయ్యే వ్యయం, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు, సొరంగ మార్గాల ప్రత్యేక నిర్వహణ, ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

మహానగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 50 లక్షలకు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు కోటి జనాభా ఉంటే సగటున ప్రతి ఇద్దరికీ ఒక్క వాహనం అన్నట్లుగా ఏటేటా వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ద్విచక్రవాహనాలు 35 లక్షలు.. కార్లు 10 లక్షలు.. బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు ఐదు లక్షల మేర ఉన్నాయి. గత ఏడాది 4.42 లక్షల వాహనాలు కొత్తగా నమోదయ్యాయి.

3 లెవెల్స్‌లో మెట్రో స్టేషన్లు
మొత్తం 72 కి.మీ. మార్గంలో 64 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి స్టేషన్‌ను మూడు భాగాలుగా విభజించారు. రోడ్‌ లెవల్‌లో పాదచారుల దారులు, బస్‌బేలు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపే స్థలాలు, స్టేషన్‌ పైకి చేరుకునేందుకు మెట్లు, లిఫ్టు, ఎస్కలేటర్లు రెండు వైపులా ఉంటాయి. ఇక రెండోభాగాన్ని కాన్‌కోర్స్‌ లెవల్‌(మధ్యభాగం)గా పిలుస్తారు. ఇక్కడే ప్రతి స్టేషన్‌లో సరాసరిన 9,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం(రిటైల్‌ స్పేస్‌) అందుబాటులో ఉంటుంది. మూడో భాగాన్ని ప్లాట్‌ఫాం లెవల్‌ అంటారు. ఇక్కడే ప్రయాణీకులు రైలు ఎక్కాలి.

నగర జీవనంపై మెట్రో ప్రభావం ఇదీ..
తగ్గనున్న ట్రాఫికర్‌: గ్రేటర్‌ సిటిజన్లు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని నిత్యం 2–4 గంటల విలువైన పనిగంటలను ప్రతీరోజూ కోల్పోయే దుస్థితి తప్పనుంది. ప్రధాన రూట్లలో ఒక చోట నుంచి చివరి గమ్యం వరకు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు అవకాశం.
కాలుష్యం–పర్యావరణం: నగరంలో రోజూ 50 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండటంతో వెలువడుతోన్న కాలుష్య మేఘాలకు మెట్రో రైళ్లతో చెక్‌ పడనుంది. తొలిదశ మార్గంలో 2–2.5 లక్షలు.. మొత్తం మూడు కారిడార్లు పూర్తయితే 16 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించనున్న నేపథ్యంలో ఆ మేర రోడ్డెక్కే వాహనాల సంఖ్య తగ్గనుంది.
పెట్టుబడులు–ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి: మెట్రో కారిడార్లలో ఏర్పాటు చేయనున్న మాల్స్, రియల్టీ ప్రాజెక్టుల ద్వారా దశలవారీగా రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తగ్గనున్న పెట్రోలు–డీజిల్‌ వినియోగం: నగరంలో నిత్యం వినియోగిస్తున్న పెట్రోలు, డీజిల్‌ వినియోగం గణనీయంగా తగ్గనుంది.

స్టేషన్ల వద్ద పార్కింగ్‌ వసతి ఇలా..
నాగోల్‌–అమీర్‌పేట్‌(18కి.మీ.) 
మార్గంలో మొత్తం స్టేషన్లు:13
పార్కింగ్‌ వసతి ఉన్న స్టేషన్లు: నాగోల్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, బేగంపేట్, అమీర్‌పేట్‌(6)
పార్కింగ్‌ లేనివి: స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సీగూడా, తార్నాక, సికింద్రాబాద్‌ వైఎంసీ, ప్యారడైజ్, ప్రకాశ్‌నగర్‌(7)
మియాపూర్‌–ఎస్‌ఆర్‌నగర్‌(12 కి.మీ) మార్గంలో మొత్తం స్టేషన్లు:10
పార్కింగ్‌ వసతి ఉన్నస్టేషన్లు: మియాపూర్‌ టర్మినల్‌ స్టేషన్, బాలానగర్, కూకట్‌పల్లి, భరత్‌నగర్‌(4)
పార్కింగ్‌ లేనివి: జేఎన్‌టీయూ, కేపీ హెచ్‌బీ, మూసాపేట్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌ నగర్‌(6)

గ్రేటర్‌లో ప్రస్తుత ప్రజారవాణా ముఖచిత్రమిదే
నగరంలో ఆర్టీసీ బస్సులు 3,850
ప్రతి రోజు ట్రిప్పులు 42,000
రోజువారీ ప్రయాణికులు 34 లక్షలు

ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో ప్రయాణీకులిలా..
- ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి వరకు ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు తిరుగుతున్నాయి. నిత్యం లక్షా 60 వేల మంది ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగిస్తున్నారు.
- గ్రేటర్‌లో 1.25 లక్షల ఆటోలు ఉన్నాయి. ప్రతి రోజు 8 లక్షల మంది ఆటోలను వినియోగిస్తున్నారు.
- నగరంలో 1.20 లక్షల క్యాబ్‌ సర్వీసులున్నాయి. వీటిల్లో 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

అంకెల్లో మన మెట్రో బాహుబలి
మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.16,830కోట్లు (ఇందులో ఎల్‌అండ్‌టీ రూ.13,693 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,179 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.958 కోట్లు వ్యయం చేస్తున్నాయి)
హైదరాబాద్‌ మెట్రో విశిష్టత: ఒకే పిల్లర్‌ ఆధారంగా స్టేషన్లు, మెట్రో మార్గం నిర్మాణం
మెట్రో నిర్మాణంలో పాలుపంచుకుంటున్న విదేశీ సంస్థలు: 10
మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే సమయాలు: ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 వరకు
పిల్లర్లపై ఏర్పాటు చేసిన వయాడక్ట్‌ సెగ్మెంట్లు: 28,000 
(ఉప్పల్, కుత్బుల్లాపూర్‌ కాస్టింగ్‌ యార్డుల్లో తయారీ)
మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో రైలు ట్రాక్‌: 172 కి.మీ.
మెట్రో సాధించిన అవార్డులు: ఏసీఐ, గోల్డ్‌ అవార్డ్, గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్, స్ట్రాటజిక్‌ గ్లోబల్‌ ప్రాజెక్ట్, కనస్ట్రక్షన్‌ వీక్‌
పనుల్లో నిమగ్నమైన ఇంజనీర్లు: 2,500 మంది
నిపుణులైన కార్మికులు: 17,500 మంది
3 కారిడార్లలో నిత్యం ప్రయాణించే వారు: పూర్తి స్థాయిలో ప్రారంభమైతే 16 లక్షలు, 2022 నాటికి 24 లక్షలు (అంచనా).
మెట్రో తొలి పిల్లర్‌ ఏర్పాటు: 2011, నవంబర్‌.
కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు: 269 ఎకరాలు
ప్రాజెక్టులో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి: 120 ఎకరాలు
మెట్రోకు వచ్చే ఆదాయం: 50% ప్రయాణికుల చార్జీలు, 45% రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, 5% వాణిజ్య ప్రకటనలు.
ఒక్కో రైలులో ప్రయాణించే ప్రయాణికులు: 1000 మంది(3 బోగీలు). ఆరు బోగీలైతే(రెండు వేల మంది). ప్రతి రైలులో ఒక బోగీని మహిళలకు కేటాయించే అవకాశం. 
మెట్రో రైలు వేగం: సగటు వేగం 34 కేఎంపీహెచ్, గరిష్టంగా 90 కేఎంపీహెచ్‌
ప్రపంచంలో పీపీపీ విధానంలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు:హైదరాబాద్‌ మెట్రో రైలు
మెట్రోలో లగేజీ చార్జీ: పది కేజీల వరకు ఉచితం. 
ఆపైన ప్రతి కిలోకు ఒక రూపాయి.
మెట్రో రెండో దశ: సుమారు 250 కి.మీ.(ప్రభుత్వ పరిశీలనలో ఉంది)
ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులు: సుమారు వంద
లాభాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులు: సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపీ
దేశంలో ప్రస్తుతం మెట్రో రైలు ప్రాజెక్టులు అందుబాటులో ఉన్న నగరాలు: 6. కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్‌
దేశంలో మెట్రో ప్రాజెక్టులు చేపడుతున్న ఇతర నగరాలు: 14
మెట్రో స్టేషన్లలో వాణిజ్య దుకాణాలకు ప్రతి చదరపు అడుగుకు నెలవారీ అద్దె: కనిష్టంగా రూ.120 గరిష్టంగా రూ.450(ప్రాంతాన్ని బట్టి)
ఒక్కో పిల్లరు మోసే బరువు: సుమారు 4 వేల టన్నులు

మెట్రో ప్రయాణంతో సమయం ఆదా ఇలా..
మియాపూర్‌–అమీర్‌పేట్‌(12కి.మీ) మార్గంలో ప్రతి ఏడు నిమిషాలకొకటి చొప్పున మొత్తం 8 రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో పది స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌లో 30 సెకన్లపాటు రైలు ఆగుతుంది. అంటే మియాపూర్‌లో బయలుదేరిన వ్యక్తి 15 నిమిషాల్లో అమీర్‌పేట్‌ చేరుకోవచ్చు. అదే బస్‌లో అయితే 50 నిమిషాలు, బైక్‌పై అయితే 40 నిమిషాల సమయం పడుతుందని అంచనా.

అమీర్‌పేట్‌–నాగోల్‌(18 కి.మీ) మార్గంలో ప్రతి 10–12 నిమిషాలకు ఒక రైలు చొప్పున నిత్యం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్లో 13 స్టేషన్లు ఉన్నాయి. ప్రయాణీకుల డిమాండ్‌ను బట్టి ట్రిప్పుల సంఖ్య పెరుగుతుంది. అమీర్‌పేట్‌లో బయలుదేరే వ్యక్తి నాగోల్‌కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బైక్‌పై అయితే 50 నిమిషాలు, బస్సులో అయితే 75 నిమిషాల సమయం పడుతుంది.

గ్రేటర్‌ మెట్రో సమగ్ర స్వరూపం
మొత్తం 72 కి.మీ. మార్గంలో మూడు కారిడార్లతో మెట్రో ప్రాజెక్టును 2011లో చేపట్టారు. ప్రస్తుతం పాతనగరంలో 6 కి.మీ. మినహా 66 కి.మీ. మార్గంలో పనులు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్‌ 28న నాగోల్‌–అమీర్‌పేట్‌ (18కి.మీ.), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (12కి.మీ.) మార్గంలో తొలిదశ ప్రాజెక్టును ప్రారంభిం చాలని ముహూర్తం నిర్ణయించారు. మిగతా మార్గాన్ని వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

సమయం ఆదా ఇలా.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement