సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మోర్తాడ్ : వ్యవసాయానికి అండదండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు సూక్ష్మ సేద్యానికి రూ. 150 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం పది జిల్లాలకు భారీగా నిధులను కేటాయించి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించిందన్నారు.
శనివారం మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూక్ష్మ సేద్యంతో సాగునీటి కొరతను అధిగమించవచ్చన్నారు. వరి మినహా ఇతర వాణిజ్య, ఆహార పంటలకు సూక్ష్మ సేద్యం మేలైందన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి మన సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు.
రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను సృష్టించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.సహకార సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులను నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వసతులను కల్పించడానికి సహకార శాఖ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు తాళ్లరాంపూర్‌లో గిడ్డంగి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చానన్నారు. అప్పటి చైర్మన్ క్యాతం నర్సింలును వేదికపైకి పిలిపించిన మంత్రి పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు.
గ్రామస్తులు స్థలం కేటాయిస్తే కోల్డ్ స్టోరేజీని నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..మారుమూల గ్రామంలోని ఒక చిన్న సహకార సంఘం రైస్‌మిల్లును నిర్మించి కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఆసరా పింఛన్ గురించి అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పట్వారి గంగాధర్‌రావు, డెరైక్టర్ సోమచిన్న గంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అమిత, ఎంపీపీ కల్లెడ చిన్నయ్య పాల్గొన్నారు.