కోరుట్లలో మైక్రో ఫైనాన్స్ బాధితులు
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని వందలాది కుటుంబాలు ఇలా మైక్రోఫైనాన్స్ ఊబిలో చిక్కి నరకయాతన పడుతున్నారు. 3 నెలల వ్యవధిలో కోరుట్లలోని అల్లమయ్యగుట్ట కాలనీ, కథలాపూర్ మండలం కల్వకోట గ్రామా ల్లో ఇదే రీతిలో మైక్రోఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టినా మార్పులేదు. పేదల కాలనీలు లక్ష్యంగా ‘మైక్రో గద్దలు’ జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో యథేచ్ఛగా వడ్డీలకు డబ్బులు ఇస్తూ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి.
టార్గెట్.. స్లమ్ ఏరియాలు..
ఏపీలోని పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొంత మంది నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాలుగా మైక్రోఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతులు లేకుండా.. కనీసం మనీ లెండింగ్ లైసెన్సులు లేకుండా అడ్డగోలు వడ్డీలకు అప్పులు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలను టార్గెట్‌గా చేసుకుని బ్యాంకులు.. ఇతరత్రా సంస్థల నుంచి అప్పులు పుట్టని పేదలకు అప్పుల ఎర వేస్తారు.
ఇదీ.. అప్పు తీరు
పట్టణ ప్రాంతాల్లోని పేదలు నివాసముండే కాలనీల్లో రోజువారీ పనిచేసుకునే మహిళలను పది మందిని గ్రూపుగా ఏర్పాటుచేస్తారు. ఈ గ్రూపులో ఒక్కొక్కరికి అప్పుగా రూ.5 వేల నుంచి 25 వేలవరకు ఇస్తారు. అప్పు తీసుకున్న వారిలో ఏ ఒక్కరు డబ్బులు చెల్లించకున్నా గ్రూపులోని మిగిలినవారు ఆ డబ్బులు చెల్లించాలన్న నిబంధన పెడతారు. అప్పు ఇవ్వడానికి ముందే వడ్డీ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత వారానికి ఓసారి వచ్చి డబ్బులు వసూలు చేసుకుంటారు. రూ.12వేలు వడ్డీకి తీసుకున్న వారు మూడు నెలల్లో రూ. 14,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీ రూ.8 శాతం వరకు పడుతోంది. ఒకవేళ మూడు నెలల్లోగా తీసుకున్న అప్పు తీర్చని వారికి మిగిలిన డబ్బులతో కలుపుకుని మళ్లీ అప్పు ఇస్తారు. ఇలా వరసబెట్టి అప్పు మీద అప్పులు ఇస్తూ అడ్డగోలు వడ్డీతో తీరని రుణాలను మిగుల్చుతారు. ఇక వసూళ్ల కోసం పగలు..రాత్రి తేడా లేకుండా ఇళ్లకు వచ్చి మహిళలను వేధిస్తారు. ఈ రీతిలో రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు రాత్రి వేళ తన ఇంటికి వచ్చి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు.
నియంత్రణ కరువు..
అప్పుల పేరిట పేదలను వడ్డీల ఊబిలోకి దించుతున్న మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై నియంత్రణ కరువైంది. మూడు నెలల క్రితం కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై కేసు పెట్టి అరెస్టు చేశారు. అయినా, ఎప్పటిలాగే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కోరుట్ల లోని మాదాపూర్ కాలనీలో సుమారు నాలుగేళ్లుగా 120 మంది మహిళలు మైక్రో ఉచ్చులో పడి ఆందోళన చెందుతున్నారు. మెట్‌పల్లి, జగిత్యాల పట్టణాల్లోనూ రెండు కాలనీల్లో మైక్రో నిర్వాహకులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ పేదలను అప్పుల ఊబిలోకి దించుతున్నట్లు సమాచారం.
అప్పు కట్టాలని సతాయిస్తున్నారు
మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు అప్పుల కోసం రోజు కాలనీకి వచ్చి వేధిస్తున్నారు. దీపావళి రోజూ కాలనీకి వచ్చి చాలామంది మహిళలను డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టారు. పండుగ రోజు వేధింపులతో చాలా మంది అవస్థలు పడ్డారు. వడ్డీల లెక్క చెప్పడం లేదు.. ఎంత కట్టినా మళ్లీ ఎంతో కొంత అప్పు ఉందని తేలుస్తారు.
– రేష్మా, మాదాపూర్‌కాలనీ, కోరుట్ల
ఈ యువకుడి పేరు అఫ్రోజ్(18). తొమ్మిదో తరగతి చదివి ఆపేశాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఇతని తల్లి ఇర్ఫానా బీడీలు చుడుతుంది.. తండ్రి ఆసిఫ్ ఐస్‌క్రీం అమ్ముతాడు. ఏడాది క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికి వచ్చి రూ. 6 వేలు అప్పు ఇచ్చారు. వారానికి రూ.600 చొప్పున 12 వారాల్లో రూ.7,200 కట్టాలన్నారు. అయితే, ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అప్పు తీర్చలేకపోతోంది. పొద్దస్తమానం పనిచేసి సంపాదించిన డబ్బులు పొట్ట కూటికే సరిపోతుండగా.. మైక్రో అప్పుల ఊబి నుంచి బయటపడటానికి అఫ్రోజ్‌ను సెంట్రింగ్ పనులకు పంపుతున్నారు.
ఈమె పేరు సుజాత కోరుట్లలో నివాసముంటుంది. భర్త కిషన్ వంటలు చేస్తాడు. రెండేళ్ల క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇచ్చిన రూ.5 వేల అప్పు కట్టలేక అవస్థలు పడుతోంది. వడ్డీల భారంతో తీసుకున్న రుణం తీరకపోవడంతో కూతుర్ని కాలేజీ బంద్ చేయించి తనతోపాటు బీడీలు చేయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment