గుండె గు‘బెల్’..!
పేద, మధ్యతరగతి వర్గాలకు గుబులు పుట్టించే నెల జూన్. పిల్లల స్కూళ్లకు బెల్ మోగుతోందంటే చాలు తల్లిదండ్రులకు ఖర్చుల చిట్టా కళ్లుముందు పడగ విప్పుతుంది. గుండె గుభేల్ మంటుంది. ముందస్తు ప్రణాళిక ఉంటే ఓకే. లేకుంటే...ఫీజుల భారాన్ని, పుస్తకాల తదితరాలకయ్యే వ్యయాలను గట్టెక్కడం కష్టమే. ఏటా పెరుగుతున్న ఈ బడ్జెట్‌పై అందరిలోనూ టెన్షన్ మొదలవుతోంది.
పాలమూరు : ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకొని కుటుంబాన్ని నడుపుతున్న మధ్యతరగతి, వేతన జీవులకు జూన్ నెల చదువుల సీజన్ వచ్చిందంటే చాలు.. గుండెల్లో గుబులు మొదలవుతుంది. నేటి నుంచి బడి గంటలు మోగనుండటంతో చదువుల భారాన్ని తట్టుకునేదెలా అని గాభరా పడుతున్నారు
పుస్తకాల భారం మోయడం విద్యార్థులకు ఒక ఎత్తయితే వాటి ఖర్చు భరించడం సామాన్యులకు రెండింతల బరువవుతోంది. ఏటా పెరుగుతున్న పుస్తకాల ధరలు, ఫీజులు, డ్రస్సులు, ఇతరత్రా సామాగ్రి ధరలే ఇందుకు కారణమవుతున్నాయి. అసలే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇటు వ్యవసాయానికి.. అటు విద్యార్థులపై పెట్టు ‘బడి’ భారం తడిసి మోపెడవుతోంది. జూన్ నెల వచ్చిందంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. ఉన్నత వర్గాల వారి మాట అటుంచి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి మాత్రం ఈ మాసమంటేనే హడల్. పిల్లలను బడుల్లో చేర్పించాలి.. పుస్తకాలు కొనాలి.. దుస్తులు, షూస్ కొనాలంటే కనీసం రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత డబ్బు ఒక్కసారిగా కావాలంటే వేతన జీవులు కష్టాలు పడాల్సిందే. పిల్లల చదువులకోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు చేతిలో డబ్బుల్లేని వారంతా అప్పులపాలు కావాల్సిందే. మేం పడ్డ కష్టం మా పిల్లలు కూడా పడకూడదు.
వాళ్లు బాగా చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచన ప్రతి సాధారణంగా అందరు తల్లి తండ్రుల్లోనూ ఉంటుంది. తగినంత ఆర్థిక స్థోమత లేకున్నా తమ పిల్లలను చదించేందుకు పలువురు ఆస్తులను సైతం తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. నేడు పాఠశాలల పునఃప్రారంభం కానుండటంతో పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు స్కూల్ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తమ పిల్లలను సంతృప్తి పర్చేందుకు వారి తల్లి తండ్రులు నానాయాతన పడాల్సి వస్తోంది.