సాక్షి, సిటీబ్యూరో: ఉన్నఊరు.. కన్నవారు.. ఆ గాలి.. ఆ నేల..ఆ ఆత్మీయ అనుబంధాలు మదిలో మెదిలాయి.. నగరంలో నరకం అనుభవించే కంటే ఓసారి ఊరికి పోయొస్తే తప్ప ప్రాణం కుదుట పడదంటూ స్వగ్రామాలకు వెళ్తున్న వలసకూలీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉపాధి కల్పించలేక నగరాలకు పోమ్మన్న ఊరు సైతం.. ఇప్పుడు కరోనా బారినపడకుండా కలో..గంజో తాగి జీవిద్దాం తిరిగి రమ్మంటోంది.వలస కార్మికులకు కూడాసొంతూరు వెళ్లడం సెంటిమెంట్‌గా తయారైంది. లాక్‌డౌన్ మినహాయింపులతో వివిధరంగాల పనులు మొదలైనా.. వలస కార్మికుల అడుగులు మాత్రం సొంతూళ్ల వైపు పడుతున్నాయి. ఇప్పటికే కాలినడక, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు,బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, శ్రామిక రైళ్లు, తదితర మార్గాల్లో సుమారు 10 లక్షల మందికి పైగా వలస కార్మికులు హైదరాబాద్ నగరం దాటేశారు. మరో సుమారు 2 లక్షల వరకు సొంతూళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నాలు సాగుతున్నా.. ఒక్కసారి చూసి వస్తామంటూ స్వస్థలాల బాట పడుతున్నారు.
మూటా ముల్లే సర్దుకుని..
లాక్‌డౌన్‌తో లక్షలాది మంది వలస జీవులు చేతిలో పనులు లేక.. పూట గడవడం కష్టమై ఇప్పటికే మూటా ముల్లే సర్దుకున్నారు. నెలన్నర రోజులుగా సొంతూళ్లకు వలస కొనసాగుతూనే ఉంది. అప్పట్లో లాక్‌డౌన్ ఎప్పుడేత్తేసారో తెలియక.. ఉపాధిపై భరోసా లేక కాలినడకన స్వస్థలాల బాటపట్టగా, ఆ తర్వాత ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌తో బస్సులు, రైళ్లలో ప్రయాణమవుతున్నారు. రైళ్లలో మాత్రం స్వస్థలం దగ్గర వరకు గమ్యం చేరుకుంటున్నా.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులు మాత్రం రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే రాకపోకలకు పరిమితమవుతున్నాయి. ఇప్పటికే 70 శాతం వలస కార్మికుల స్వస్థలాలకు చేరుకోగా, మరికొంత మంది ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి.
ముందుకు సాగని భవన నిర్మాణ పనులు..
లాక్‌డౌన్‌లో మినహాయింపు లభించిన భవన నిర్మాణ రంగం పనులు ముందుకు సాగడం లేదు. కూలీ కొరతతో çపది శాతం పనులు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. నిపుణులైన కార్మికులు అందుబాటులో లేక పరిశ్రమల ఉత్పత్తి పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. భవన నిర్మాణ రంగం కూలీలు క్యాంపులన్నీ ఖాళీ అయ్యాయి. సుమారు 1500కుపైగా ప్రాంతాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా భవన నిర్మాణ రంగం కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. ఇప్పటికే 70 శాతానికి పైగా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కూలీలను ఆపడంతో పాటు వెళ్లిపోయిన కూలీలను సైతం తిరిగి రప్పించేందుకు భవన నిర్మాణ రంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
శ్రామిక్ రైళ్లలో రెండు లక్షల మందికిపైనే..
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో సుమారు రెండు లక్షల మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 1 నుంచి శ్రామిక ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, శివారు ప్రాంతాల్లోని లింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, ఘట్‌కేసర్, బీబీనగర్, చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్ల నుంచి ఇప్పటి వరకు 198 శ్రామిక్ రైళ్లు బిహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. మరో రెండు శ్రామిక రైళ్లు శుక్రవారం బయలుదేరనున్నాయి.
కొనసాగుతున్న తాకిడి..
వలస కార్మికులు సొంతూళ్ల వెళ్లేందుకు సుమారు ఐదు లక్షలకుపైగా అధికారికంగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలన్నర రోజులుగా పోలీస్టేషన్లకు వలస కార్మికుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహానగర పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 5.20 లక్షల మంది వలస కూలీలు, కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో రైలు మార్గం ద్వారా రెండు లక్షల మంది ప్రయాణం కాగా, మరో 3.20 లక్షల మంది బస్సులు, వాహనాలు, ఇతరత్రా మార్గాల ద్వారా రాష్ట్ర సరిహద్దు దాటేశారు. అధికారిక లెక్కల్లో లేని సుమారు రెండు లక్షలకుపైగా కార్మికులు కాలినడకన, మరో మూడు లక్షల వరకు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు, గూడ్స్ వాహనాల ద్వారా సొంతూళ్ల బాట పట్టారు.
సెంటిమెంట్ ప్రయాణాలవీ..
లాక్‌డౌన్‌లో భవన నిర్మాణ రంగానికి మినహాయింపుతో పనులు ప్రారంభమైనా.. వలస కార్మికులు ఆగడం లేదు. సొంతూళ్లకు వెళ్లి వస్తామంటున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో సొంతూళ్లకు వెళ్లాలన్న సెంటిమెంట్ పెరిగింది. అక్కడికి వెళ్లి వస్తే కానీ వారు కుదుట పడే పరిస్థితి కనిపించడం లేదు. వెళ్తామన్న వారిని పంపిస్తున్నాం. మళ్లీ వస్తామంటున్నారు. అందుబాటులో ఉన్న వారితో పనులు చేయిస్తున్నాం.
– రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్, హైదరాబా
ప్రయాణాలు ఆగడం లేదు..
వలస కార్మికుల ప్రయాణాలు ఆగడం లేదు. స్వస్థలాలకు రైళ్లు, ప్రత్యేక బస్సులో వెళ్లేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కేవలం మేడ్చల్ క్యాంప్ నుంచే సుమారు రెండున్నర లక్షల మంది వరకు వలస కార్మికులను స్వస్థలాలకు తరలి వెళ్లారు. క్యాంప్ ఎత్తివేసినా.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడికి వస్తూనే ఉన్నారు. వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం.– డేవిడ్ సుధాకర్,సోషల్ వర్కర్, మేడ్చల్
Comments
Please login to add a commentAdd a comment