మంత్రి చందూలాల్కు చేదు అనుభవం
- హోటల్ గేటు వద్దే అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- సీఎం లోనికి వెళ్లేదాకా అక్కడే నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌కు చేదు అనుభవం మిగిల్చింది. సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మారియట్ హోటల్‌కు చేరుకున్న ఆయన్ను, సీఎం వస్తున్నారంటూ భద్రత సిబ్బంది గేటు వద్దే అడ్డుకుని రోడ్డుపై నిలిపివేశారు. కారు దిగి హోటల్ లోపలికి నడుచుకుంటూ వెళ్లబోయినా ఒప్పుకోలేదు. సీఎం కాన్వాయ్ సమీపించిందని, ఆయన లోపలకు వెళ్లేదాకా అక్కడే వేచి వుండాలని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో, సీఎం కాన్వాయ్ వచ్చి హోటల్ లోపలికి వెళ్లేదాకా కొద్ది నిమిషాల పాటు చందూలాల్ అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అదే సమయంలో మంత్రి కేటీఆర్ వచ్చి రోడ్డుపైనే కారు దిగి హోటల్లోకి నడుస్తూ వెళ్లిపోవడంతో చందూలాల్ కూడా ఆయన్ను అనుసరించారు. ఇక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఐపీఎస్‌లకు మాత్రం భద్రతా సిబ్బంది రాచబాట పరిచారు.
ఐపీఎస్‌ల వాహనాలు హోటల్ లోపలిదాకా వెళ్లి వారిని ప్రవేశ ద్వారం వరకు దిగబెట్టి తిరిగొచ్చాయి. కానీ కలెక్టర్లతో సహా ఐఏఎస్‌ల వాహనాలను మాత్రం పోలీసులు హోటల్ ప్రధాన గేటు వద్దే రోడ్డుపై ఆపేశారు. దాంతో వారంతా అక్కణ్నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ల సదస్సు అధికారులు, ప్రజాప్రతినిధుల కోలాహాలంతో కిక్కిరిసిపోయింది. తొలి రోజు సదస్సు ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటల దాకా సుదీర్ఘంగా సాగింది.