
ఈటల రాజేందర్ కారు బోల్తా.. గాయాలు
మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా... శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది.
ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు.
హుజూరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మరో పది నిమిషాల్లో కరీంనగర్ చేరుకుంటారనగా మానకొండూరు సమీపంలో ప్రమాదం జరిగింది. ముందు సీట్లో కూర్చున్న మంత్రికే ఎక్కువ గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఏ విషయమూ ఇంకా స్పష్టంగా చెప్పడంలేదు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాత్రమే అంటున్నారు. కరీంనగర్లోని అపోలో రీచ్ ఆస్పత్రికి కేవలం ఈటెల రాజేందర్ ఒక్కరినే తరలించారు. మిగిలినవారిని వేరే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న వాహనం.. ఎదురుగా ఉన్న టిప్పర్ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురైంది.
కాగా, మంత్రి వాహనానికి నెల రోజుల్లో ఇది రెండో ప్రమాదం. నెల రోజుల క్రితం ఇదే వాహనం ప్రమాదానికి గురైంది. తాడిచెట్టును ఢీకొన్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సమయానికి మంత్రి రాజేందర్ ఆ వాహనంలో లేరు. ఎంపీ వినోద్ వాహనంలో ప్రయాణిస్తుండటంతో ఆయన అప్పట్లో ప్రమాదం తప్పించుకున్నారు.