
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ‘అమ్మా.. నీ కుటుంబానికి నేను అండగా ఉంటా.. కొడుకు మీద బెంగ పెట్టుకుని బాధపడకు.. పెద్ద కొడుకు రాజుకు గజ్వేల్ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తా.. మురళి బాగా చదివేటోడంట.. చనిపోయాడంటే నాకే బాధగా ఉంది..ఏమి రంధి పెట్టుకోకు..ఇచ్చిన డబ్బులతో అప్పులుంటే కట్టుకుని మిగిలినవి భద్రపర్చుకో..’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మురళి తల్లి లక్ష్మికి భరోసానిచ్చారు. ఈ నెల 3వ తేదీన ఓయూలో దౌలాపూర్‌కి చెందిన విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రోజే లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి .. నాడు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రాత్రి ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలసి దౌలాపూర్‌కు వచ్చారు. మురళి తల్లి లక్ష్మి, అన్న రాజును పరామర్శించారు. ఉదంతంపై మొదట ఆయన ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ మురళి ఆత్మ హత్య ఘటన బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, యువత ఆత్మసైర్థ్యంతో ఉండాలన్నారు. కన్నవాళ్లకు శోకం పెట్టవద్దని సూచించారు.
రూ.10 లక్షల ఆర్థికసాయం
మురళి కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ పరంగా మంత్రి హరీశ్‌రావు రూ.10 లక్షల నగదును అందజేశారు. అనంతరం మురళి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏదైనా బాధ ఉంటే మీ ఊరుకు చెందిన కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డికి తెలపాలని లక్ష్మికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment