కొండపాక (మెదక్ జిల్లా) : అర్హులైన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు మంజూరు చేయించే బాధ్యత తమదేనని కార్మిక కుటుంబాలకు మంత్రి తన్నీరు హరీష్‌రావు భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని దుద్దెడ గ్రామ చేనేత కార్మిక కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షలతో వర్కు షెడ్ నిర్మాణానికి మంగళవారం గ్రామ చేనేత సహకార సంఘం అధ్యక్షులు రాజగిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాల్లో కార్మికులు నేసిన బట్టలను ఆప్కో వారు కొనుగోలు చేసేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఇదివరకు ఉన్న అంత్యోదయ కార్డులు రద్దవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో 50 వేల అంత్యోదయ కార్డులకు గాను 20 వేల పైచిలుకు అంత్యోదయ కార్డులకు కేంద్ర ప్రభుత్వం కోతవిధించిదన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక్కరికి ఇచ్చే 4 కిలోల బియాన్ని 6 కిలోల వరకు ఇచ్చేలా నిర్ణయం తీసుకొని రేషన్ దుకాణాల నుంచి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన సంఘ భవనాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో ప్రతీ ఇంటికి వాటర్‌గ్రిడ్ పథకంలో నల్లా కనెక్షన్ ద్వారా నీరు వచ్చేలా చూసేందుకు ప్రభుత్వం రూ. కోటీ 30లక్షలను మంజూరు చేసిందన్నారు. మూడునాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. తెలంగాణా కోసం జరుగుతున్న మలిదశ ఉద్యమంలో దుద్దెడ గ్రామ చేనేత కార్మికులు దుద్దెడ నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణా భవన్ వరకు మగ్గంపై చీరను నేసుకుంటూ వెళ్ళారని.. దీంతో గ్రామ ప్రజల ఉద్యమ స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దుద్దెడ గ్రామ ప్రజల పట్ల సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేకతను కనబరుస్తున్నారని గుర్తు చేశారు.
దేవాదుల నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా మండలంలోని 11 గ్రామాలకు కాలువల ద్వారా నీటిని మళ్ళించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల రూ. 40 కోట్లు మంజూరు చేశారని మంత్రి చెప్పారు. ఫలితంగా 15వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ అనంతుల పద్మా-నరేందర్, సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ బాల్‌నర్సు, ఎంపీటీసీ బాకీ భూమవ్వ, సర్పంచ్‌లు ఏర్పుల యాదయ్య, కనకారెడ్డి,ఎంపీపీ ఉపాధ్యక్షులు రాధాకిషన్‌రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ర్యాగల దుర్గయ్య, యూత్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, నాయకులు బొద్దుల కనుకయ్య, దేశాయిరెడ్డి, వడ్లకొండ శ్రీనివాస్, చేనేత కార్మిక సంఘం నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు.
'అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు'
Published Tue, Sep 8 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement
Advertisement