సాక్షి, హైదరాబాద్: ‘జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు ఇప్పటికీ భారతదేశం గ్రామాల్లోనే ఉంది. అయితే, దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తున్నవి మాత్రం పట్టణ ప్రాంతాలే’అని ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడిన ‘‘యూనియన్ అఫ్ స్టేట్స్’’సెషన్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ఆర్థిక ప్రగతి సాధించడంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాల తీరుపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఉన్నతమైన అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల్లో సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై దేశంలో నూతన ఆలోచనలకు కొరతలేదని, పెట్టుబడుల కొరత మాత్రమే ఉం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టణాల్లో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కోసం అనేక విదే శీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వ నియంత్రణతో రాష్ట్రాల్లో స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే అవకాశం లేదన్నారు. పట్టణ ప్రాం తాల్లో మౌలికవసతులను పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని అన్నారు.
కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే ప్రగతి
ఆర్థిక పురోగతిపై దూరదృష్టితో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంగా పనిచేసినప్పుడే ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలతోపాటు ఉమ్మడిజాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఆర్థిక పురోగతి వేగవంతమవుతుందని, అధికార వికేంద్రీకరణలో భాగంగానే తెలంగాణలో 33 కొత్తజిల్లాలతోపాటు 3,500 పం చాయతీలు, పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రగతిశీల నాయకత్వంతోనే అభివృద్ధి
ఐదున్నరేళ్లలో తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని, అనేక విధానాలను కేంద్రం నిర్ణయిస్తున్నా వాటి అమలు మాత్రం రాష్ట్రాల్లోనే జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రగతిశీల నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతాయనేందుకు తెలంగాణను ప్రత్యక్ష ఉదాహరణగా అభివరి్ణంచారు. టీఎస్‌ఐపాస్ ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ చట్టం ద్వారా పరిశ్రమల అనుమతులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 11 వేలకుపైగా అనుమతులను ఇచ్చామని, ఇందులో 8,400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చగా,12 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వివిధ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment