ప్రభుత్వ ఆసుపత్రులు భేష్
► వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కితాబు
► శ్రీలంకలో పర్యటిస్తున్న మంత్రి బృందం
సాక్షి, హైదరాబాద్: శ్రీలంక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు బాగున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. రెండ్రోజుల పర్యటనకు ఆ దేశం వెళ్లిన ఆయన ఆదివారం గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను పరిశీలించారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు.
రాష్ట్రంలో రూ. 5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీలంక లోని హమన్‌తోట జిల్లాలో ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. హమన్‌తోట నుంచి సాయంత్రం కొలంబోకు మంత్రి బృందం తిరిగి వచ్చింది. సోమవారం కొలంబోలో ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మంత్రితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు ఉన్నారు.