శ్రీలంకకు మంత్రి లక్ష్మారెడ్డి బృందం
► సీఎం ఆదేశంతో నేడు, రేపు పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బృందం శనివారం రాత్రి శ్రీలంకకు బయలుదేరి వెళ్లింది. రెండ్రోజులపాటు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించిన ఆయన బృందం... చెన్నై నుంచి శ్రీలంక వెళ్లింది. తెలంగాణ రాష్ట్రంలో రూ. 5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో 5 వేలకు పైగా పడకలతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో... శ్రీలంకలో ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ నిర్మించిన ఆసుపత్రులను, అక్కడి వసతులను మంత్రి బృందం ఆది, సోమవారాల్లో అధ్యయనం చేసి వస్తుంది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, ఓఎస్డీ గంగాధర్, పీఎస్ చంద్రశేఖర్ ఉన్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థ, వాటి పనితీరు, అందులో పరిశుభ్రత బ్రహ్మాండంగా ఉన్నాయని మంత్రి లక్ష్మారెడ్డి కొనియాడారు. తెలంగాణలో అటువంటి పరిస్థితి లేకపోవడానికి ప్రధాన కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. అడయార్ కేన్సర్ ఆసుపత్రిలో రూ. 18 కోట్ల విలువైన ట్రూ బీమ్ కేన్సర్ మిషన్ ఉందని.. ఇటువంటి మిషన్‌ను త్వరలో కొనుగోలు చేసి హైదరాబాద్ ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.