మంత్రి వర్సెస్‌ ముఖ్యకార్యదర్శి | Fighting between lakshma reddy and shanthi kumari in health department | Sakshi
Sakshi News home page

మంత్రి వర్సెస్‌ ముఖ్యకార్యదర్శి

Published Fri, Jul 20 2018 1:29 AM | Last Updated on Fri, Jul 20 2018 7:00 AM

Fighting between lakshma reddy and shanthi kumari in  health department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి మధ్య అధికార పోరు కొనసాగుతోంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆమెకు ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యాలయంలోనూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ముఖ్యకార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు.ఎక్కువ మంది ఉద్యోగులు, విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉండే వైద్య, ఆరోగ్య శాఖపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించట్లేరని, దీంతో సాధారణ వ్యవహారాలపై ప్రభావం పడుతోందని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు.  

పట్టని మంత్రి హామీలు!
లక్ష్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ప్రకటనల అమలు విషయంలో ముఖ్యకార్యదర్శి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన కొందరు రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

అక్కడ జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు పొంది ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన వారు మన రాష్ట్రంలోని కౌన్సెలింగ్‌కూ హాజరయ్యారు. ఆ సందర్భంగా కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే సరిపోతుందనే విషయంలో కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అంగీకరించలేదు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. అయితే ముఖ్యకార్యదర్శి దీన్ని పట్టించుకోలేదని తెలిసింది.

సీఎం ప్రకటన అమల్లోనూ జాప్యం
సీఎం కేసీఆర్‌ ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా వెళ్లారు. గట్టు మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలకు పెంచుతామని, వెంటనే ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీ ఉత్తర్వుల ప్రక్రి య వెంటనే చేపట్టలేదు. కాస్త ఆలస్యంగా జూలై 19న ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకూ సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు.

మరో 10 ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌ అంశం లోనూ ఇలాగే జరుగుతోందని సమాచారం. కాగా, శాంతికుమారికి సచివాలయంలోనీ సీ బ్లాక్‌లో ఒక పేషీ, డీ బ్లాక్‌లో మరో పేషీ కేటాయించారు. సీఎంవో కార్యాలయ అధికారి హోదాలో ప్రగతిభవన్‌లోనూ ఒక పేషీ ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిపాలనా వ్యవహారాలపై వెంటనే నిర్ణయాలు తీసుకునేందుకు డీ బ్లాక్‌లోని పేషీలో అందుబాటులో ఉండాలి. అయితే చాలా తక్కువ సమయమే ఈ పేషీలో ఉంటున్నారని, దాంతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉంటున్నాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీ బ్లాక్‌కు అనుమతి తీసుకున్న వారినే అనుమతిస్తారు. ఈ పరిస్థితితో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సైతం శాంతికుమారిని కలిసే పరిస్థితి ఉండట్లేదు. వైద్య, ఆరోగ్య శాఖ సమస్యలపై సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు మంత్రి పేషీకి వస్తున్నారు. ఇలా వచ్చే వారి సమస్యలను పరిష్కరించే ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడంతో మళ్లీ సచివాలయానికి రావాల్సి వస్తోంది. ఇలా ఎన్నిసార్లు వచ్చినా తాము ఏమీ చేయలేకపోతున్నామని మంత్రి పేషీ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement