60% ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే
► తమిళనాడు ఆరోగ్యరంగంపై రాష్ట్రం ఆరా
► మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో
► చెన్నైలో అధికారుల బృందం పర్యటన
సాక్షి, చెన్నై/ హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 60% ప్రసవాలు జరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల బృందం గుర్తించింది. తమిళనాడులో ఆసుపత్రుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం చెన్నైలో పర్యటించింది. ఈ సందర్భంగా మేడవాక్కంలోని 30 పడకల ఆసుపత్రిని, పెరునలాయార్‌లోని 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు పరిశీ లించారు. చెన్నై మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌తో మంత్రి లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు.
తమిళనాడులో అమలవుతున్న విధానాలపై అక్కడి అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యబీమా పథకం, గర్భిణులు, శిశు సంరక్షణ పథకాల గురించి రాష్ట్ర అధికారులు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు 108, 104 సేవలను పరిశీలించిన మంత్రి లక్ష్మారెడ్డి, సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ పర్యటనలో మంత్రి లకా్ష్మరెడ్డి వెంట అధికారులు రాజేశ్వర్ తివారీ, బుద్ధ ప్రకాశ్, ఎన్.శివకుమార్, అకున్ సభర్వాల్, డాక్టర్ మనోహర్, రమణి, వీణాకుమారి తదితరులు పాల్గొన్నారు.