కాట్రేవ్‌పల్లిలో రైతు బంధు చెక్కుల పంపిణీ సభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేదికపై మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా పాలమూరు జిల్లా రైతాంగానికి ఒక వరంలా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున ఇవ్వనున్న నగదు జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి గ్రామంలో రైతుబంధు పథకాన్ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పోచారం మాట్లాడారు.
ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పథకం కింద దాదాపు 3.5లక్షల మంది రైతులకు రూ.354 కోట్లు, మక్తల్ నియోజకవర్గంలో 65,900 మంది రైతులకు రూ.93.16 కోట్లు, కాట్రేవ్‌పల్లి గ్రామంలో 357 మంది రైతులకు రూ.53లక్షలను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతీ ఎకరాకు రైతుబంధు పథకం కింద నగదు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని మంత్రి అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రైతాంగానికి కొత్త ధైర్యం వచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతు రోజురోజుకు అప్పులలో కూరుకుపోతున్నాడనే ఆలోచనతో ఒక నిజమైన రైతుగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 70ఏళ్లుగా రైతుల ఓట్లతో రాజ్యమేలిన నేతలు వారి బతుకులను ఆగం చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి మొదలుకుని గ్రామ సర్పంచ్ వరకు అందరూ రైతు బిడ్డలం అని చెప్పుకుంటున్నా రైతుల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందని ప్రశ్నించారు.
యాసంగి పంటకు అందజేస్తాం...
పెట్టుబడి సాయాన్ని ఏటా వానాకాలంతో పాటుయాసంగి సీజన్‌కు కూడా అందజేస్తామని మంత్రి పోచారం తెలిపారు. ప్రతీ ఏటా మే 17వ తేదీ వరకు వానాకాలం పెట్టుబడి చెక్కులు, అలాగే నవంబర్ 18 నుంచి యాసంగి పెట్టుబడి చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతులకు ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసిన దాఖలాలు లేవన్నారు. వ్యాపారస్తులు తమ పిల్లలకు ఆస్తులను వారసత్వంగా అందిస్తుంటే.. రైతులు మాత్రం అప్పులను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతుండటాన్ని తట్టుకోలేక ఒక రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందిస్తున్నారని తెలిపారు.
అంతేకాదు గత ప్రభుత్వాల హయాంలో కరెంట్‌రాక, పంటలు ఎండిపోయి రాస్తారోకోలు, ఆందోళనలు జరిగేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్‌ను 24గంటల పాటు అందించేలా కృషిచేశారన్నారు. అదే విధంగా రైతు ఏదైన ప్రమాదవశాస్తు మరణిస్తే ఆకుటుంబాన్ని ఆదుకోవడం కోసం రూ.5లక్షల ప్రమాదభీమాను కల్పించారని, దానికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అదనంగా 30 ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారని, స్థానిక పరిస్థితులను పరిశీలించాక ఎమ్మెల్యే అడిగిన వాటికి అదనంగా మరో 20 కలిపి 50 ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
సీఎం ఆదేశాల మేరకే నైరుతికి వచ్చా...
వాస్తు ప్రకారం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఈశాన్య ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారని మంత్రి పోచారం వెల్లడించారు. అలాగే నైరుతి ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలో పథకం ప్రారంభానికి సీఎం ప్రతినిధిగా తనను పంపించారని తెలిపారు.అదేవిధంగా రైతు సమన్వయ నేతలు, వ్యవసాయ అధికారులు సమావేశమవడానికి క్లస్టర్ వేదికగా ‘రైతు వేదిక’ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అనుగుణంగా క్లస్టర్ల వారీగా స్థలాలు కేటాయించేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.
కాంగ్రెస్‌కు పది సీట్లు కూడా రావు..
రైతులకు మేలు చేసే పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని మంత్రి పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను న్యాయస్థానాల్లో కేసుల ద్వారా అడ్డుకున్నట్లు రైతుబంధు పథకంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. కుంభకోణాలు చేసే ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు.. మిగతా వారు కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఒకవేళ పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే సీటు మీద కూర్చోడానికి డజను మంది పోటీ పడుతున్నారని, ఒక్కడు కూర్చుంటే వంద మంది కాలు పట్టి లాగుతారన్నారని ఎద్దేవా చేశారు.
చాలా ఆనందంగా ఉంది!
అడ్డాకుల : పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి కోసం సాయం చేసిన ప్రభుత్వాలను చూడలేదు. నాకు 4.18 ఎకరాల భూమి ఉంటే రూ.17,800 చెక్కు వచ్చింది. వరి, పత్తి పంటలను సాగు చేయడానికి వీటిని వినియోగిస్తాను. రైతులకు మరిన్ని విధాల సాయం చేయడానికి ప్రభుత్వాలు పని చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment