
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోవడం విచారకరమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాల్లోనే విజయ పాలు, ఉత్పత్తులు లభించడం లేదన్న ఫిర్యాదులు అనేకం ఉన్నాయని మండిపడ్డారు. ముందుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, జాతీయ రహదారుల వెంట ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు విజయ ఉత్పత్తులే వాడండి..
వివిధ పథకాల కింద డెయిరీకి నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తలసాని మండిపడ్డా రు. హోర్డింగ్‌లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్వేస్టేషన్లు, టీవీలలో విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. విజయ ఉత్పత్తుల విక్రయానికి నూతనంగా వెయ్యి ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు విజయ ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం విజయ ఉత్పత్తులు మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అధికారులకు విక్రయాలపై లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారం కోసం ఒక ఏజెన్సీని నియమించుకునే విషయంపై కూడా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. రైతులతో నూతన సొసైటీల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముందన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment