
కొండంత లక్ష్యం... అందుకునేదెలా?
వాణిజ్యపన్నుల శాఖ సమీక్షలో మంత్రి తలసాని
ఆదాయం పెంపు మార్గాలపై సూచనలు
అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆదేశం
జీరో వ్యాపారాన్ని అరికట్టి, పన్ను వసూళ్లు పెంచుతాం
హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన వాణిజ్యపన్నుల శాఖను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుని పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ అనిల్ కుమా ర్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ రేవతి రోహిణిలతోపాటు డిప్యూటీ కమిషనర్లతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పన్ను వసూళ్లకు సంబంధించిన లోటుపాట్లను మం త్రి సమీక్షించారు. ‘2015-16 సంవత్సరానికి వాణిజ్యపన్నుల శాఖ రెవెన్యూ లక్ష్యం రూ. 36 వేల కోట్లు. ఈ ఏడాది పది నెలల్లోనే రూ. 24 వేల కోట్లు వసూలు చేశాం. అంటే దాదా పు 12 వేల కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుకోవాలి. గడిచిన నాలుగు నెలల్లో చూపిన చిత్తశుద్ధి వల్ల భారీగా ఆదాయం పెరిగింది. అదే స్ఫూర్తితో పనిచేయాలి’ అని మంత్రి అధికారులకు హితబోధ చేశారు.
ప్రభుత్వ పథకాలకు పన్నులే ఆధారం..
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలు మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, హాస్టళ్లకు సన్నబియ్యం, పింఛన్లు వంటి ప్రజాహిత కార్యక్రమాలకు వాణిజ్యపన్నుల శాఖ ద్వారా వచ్చే రాబడే ప్రధాన ఆధారమని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. డివిజన్‌ల వారీగా ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా వివరించినట్లు సమాచారం. ‘పెద్ద హీరోల కొత్త సినిమా వస్తే రాష్ట్రంలోని అన్ని థియేటర్ల వద్ద హౌజ్‌ఫుల్ బోర్డు ఉంటుంది.
కానీ వినోద పన్ను చెల్లించేటప్పుడు మాత్రం 30 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నట్లు థియేటర్ల యజమానులు చూపిస్తున్నారు. బంగారు, వస్త్రాల దుకాణాల్లో అమ్మకాల బిల్లులతోపాటు వారు కొనుగోలు చేసిన బిల్లులను కూడా పరిశీలించి పన్ను వసూలు చేయాలి’ అని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఆంధ్ర బోర్డర్‌లోని చెక్‌పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిఘా పెంచాలి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల నిర్మాణం పూర్తిచేయాలి, పన్ను చెల్లించనివారు, జీరో వ్యాపారం చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.’ అని మంత్రి ఆదేశించినట్లు సమాచారం.