విద్యార్థి నేత నుంచి మంత్రిగా
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : ఓటమెరుగని నాయకుడు ఈటెల రాజేందర్ మరో రికార్డు సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేత నుంచి మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. విద్యార్థి నేతగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వివాహం తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి ప్రస్తుతం పౌల్ట్రీ రంగా న్ని శాసించే స్థాయికొచ్చారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈటెల రాజేందర్ మూడుసార్లు సార్వత్రిక, రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కమలాపూర్ టు హైదరాబాద్
కమలాపూర్‌లో 20 మార్చి, 1964లో ఈటెల మల్లయ్య, వెంకటమ్మ దంపతుల ఐదో సంతానంగా ఈటెల రాజేంద ర్ జన్మించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ స్కూల్‌లో 9, పదో తరగతులు పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఆలియా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న సమయంలో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఎల్‌ఎల్‌బీ చదివారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే జమునారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం పౌల్ట్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2002లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు.
2004 సాధారణ ఎన్నికల్లో కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా నియమితులయ్యారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా రెండోసారి నియమితులయ్యారు. మరోసారి తెలంగాణ కోసం రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.