పోటాపోటీ | Miryalguda Rice Industry Association elections | Sakshi
Sakshi News home page

పోటాపోటీ

Published Sat, Sep 26 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

Miryalguda Rice Industry Association elections

 మిర్యాలగూడ : ఆసియా ఖండంలోనే ప్రముఖమైన మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీకి అసోసియేషన్ ఎన్నికలు అత్యంతప్రాధాన్యత సంతరించుకున్నవి. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఎన్నికలు పోటాపోటీగా సాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యవర్గ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగనున్న ఈ ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. మిర్యాలగూడ రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్ 1968లో ఏర్పడింది.
 
 అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే ప్రతీసారి విజయంసాధిస్తూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2011 సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో గార్లపాటి ధనమల్లయ్య గెలుపొందగా రెండవ పర్యాయం 2013లో కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ నెలాఖరుతో కార్యవర్గ పదవీ కాలం ముగియనున్నందున ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అసోసియేషన్‌కు 87 ఓట్లు ఉన్నాయి. కానీ ప్రతి ఓటు కూడా కీలకం కానున్నది.
 
 బరిలో ముగ్గురు : మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రతిసారి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గార్లపాటి ధనమల్లయ్య, ఒక పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగిన కర్నాటి రమేష్‌తో పాటు ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న బండారు కుశలయ్య పోటీలో ఉన్నారు. వీరిలో బండారు కుశలయ్య అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉంటుండగా గార్లపాటి ధనమల్లయ్య, కర్నాటి రమేష్‌లు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడనున్నారు. కాగా ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రచారాలు ముమ్మరంగా సాగిస్తున్నారు.
 
 ఇప్పటి వరకు కొనసాగిన
 అధ్యక్షులు వీరే...
 మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఎంతో మంది కొనసాగారు. 1968లో అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి 1980 వరకు గంథం విశ్వనాథం అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఐదు పర్యాయాలు చిల్లంచర్ల విజయ్‌కుమార్, మూడు పర్యాయాలు రేపాల లింగయ్య, గార్లపాటి ధనమల్లయ్య, మంచుకొండ వెంకటేశ్వర్లు, రెండు పర్యాయాలు మేడిశెట్టి వెంకటేశ్వర్లు, కొండూరు వీరయ్య, మారం ముత్తయ్య,  ఒక్కొక్క పర్యాయం తిరునగరు గంగాధర్, కర్నాటి రమేష్‌లు అధ్యక్షులుగా కొనసాగారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement