మిషన్‌ లీకేజీ! | Mission Bhagiratha Pipe Line Leakage | Sakshi
Sakshi News home page

మిషన్‌ లీకేజీ!

Published Fri, Mar 23 2018 2:35 PM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM

Mission Bhagiratha Pipe Line Leakage - Sakshi

పిట్లంలో భగీరథ పైప్‌లైన్‌నుంచి లీకవుతున్న నీరు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్‌రన్‌ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్‌వాల్వ్‌లు ఊడిపోతున్నాయి. మిషన్‌ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సాక్షి, నిజాంసాగర్‌:  మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్‌ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్‌ౖ లెన్‌ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్‌రన్‌ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్‌– సంగారెడ్డి, బోధన్‌– హైదరాబాద్, నిజాంసాగర్‌ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

పైపులైన్లకు లీకేజీలు
మిషన్‌ భగీరథ ట్రయల్‌రన్‌ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్‌ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్‌ జాయింట్‌ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మిషన్‌ భగీరథ నీటికి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్‌వాల్‌ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్‌ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్‌– హైదరాబాద్‌ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్‌ కనెక్షన్‌ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్‌ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్‌వాల్‌ ఆన్‌ఆఫ్‌ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

తున్కిపల్లి తండా వద్ద పైపులైన్ల ద్వారా వృథాగా పోతున్న నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement