
‘మిషన్’ పనులపై నిఘా!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో కమీషన్లదందాపై భారీ నీటిపారుదలశాఖ రహస్యంగా స్వీయ విచారణ చేపడుతోంది.
తొలి ముగ్గురు అవినీతిపరులపై వేటుకు కసరత్తు
{పత్యేక ప్రశ్నావళితో వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం
ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికల సమర్పణ
సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో కమీషన్లదందాపై భారీ నీటిపారుదలశాఖ రహస్యంగా స్వీయ విచారణ చేపడుతోంది. ఈ పథకంలో అధికారులు, అధికార పార్టీ నేతలు అక్కడక్కడా సుమారు రెండు శాతం కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటలిజెన్స్ అధికారులను రంగంలోకి దించి నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ బృహత్ పథకానికి అవినీతి, రాజకీయ మరక అంటుకోకుండా చూడాలన్న పట్టుదలతో ఉన్న హరీశ్‌రావు నిఘా అధికారుల నివేదికల ఆధారంగా అత్యంత అవినీతిపరులైన ముగ్గురేసి అధికారు లు, ప్రజాప్రతినిధులపై తక్షణమే వేటు వేసేం దుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే వారంలోగా అవినీతి అధికారులను గుర్తించి వారిపై వేటువేయాలని ఇంజనీర్-ఇన్-చీఫ్‌ను ఆదేశించారని, అవినీతిపరులుగా తేలిన ముగ్గు రు ప్రజాప్రతినిధులపై సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రశ్నావళితో రంగంలోకి: మిషన్ కాకతీయ పనులపై ఇంటలిజెన్స్, విజిలెన్స్ యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తోంది. జిల్లాలో పనులు జరుగుతున్న గ్రామాల్లో ఇంటలిజెన్స్ అధికారులు రహస్యంగా పర్యటిస్తూ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రత్యేక ప్రశ్నావళి తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే రోజు ప్రాథమిక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
మెదక్‌లో కమీషన్లకు నేతల పట్టు...
మెదక్ నియోజకవర్గంలో పలు చెరువు పనులకు సంబంధించి స్థానిక నేతలు కమీషన్లు కావాలని పట్టుబడుతున్న అంశంతోపాటు మిషన్ కాకతీయకు ఆటంకంగా మారుతున్న ఇతర అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో చిన్న చెరువుకు రూ. 49 లక్షలకు టెండర్ పిలవగా ఓ కాంట్రాక్టర్‌కు టెండర్ ఖరారు అయింది. చివరి నిమిషంలో ఓ ప్రజాప్రతినిధి అడ్డంపడి టెండర్ రద్దు చేయించినట్లు సమాచారం. ఇరిగేషన్‌శాఖ అధికారులు ముందుగా చెరువులో 11,000 క్యూబిక్ మీటర్ల పూడిక ఉందని నిర్ధారించగా, తాజాగా దాన్ని 21 వేల క్యూబిక్ మీటర్లకు పెంచి రూ. 84 లక్షలకు మళ్లీ టెండర్ కోట్ చేసినట్లు నివేదికలు అందాయి. అదే జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామంలో ఒక పర్క్యులేషన్ ట్యాంకుకు రూ. 39 లక్షలు కేటాయించినట్లు, దీని కింద రైతులే లేరని, ఒక ప్రజాప్రతినిధి సంబందికులే ఉన్నట్లు ఇంటెలిజె న్స్ తేల్చింది.
దొరికిన ఆధారాలు
చెరువు పనుల కాంట్రాక్టుల్లో అధికారులు 2 శాతం కమీషన్ ముందుగానే వసూలు చేస్తున్నట్లు నిఘా పరిశీలనలో అక్కడక్కడ బయటపడగా ప్రజాప్రతినిధులు వీలునుబట్టి 3 శాతంపైనే వసూలు చేస్తున్నట్లు తేలింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని ముఖ్య నేతల సమీప బంధువులు సబ్ కాంట్రాక్టర్ల అవతారమెత్తి చెరువు పనులు చేపడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించా రు. అందోలు నియోజకవర్గంలో అల్లాదుర్గం, పుల్కల్, అందోలు మండలాల్లో చెరువు పనులను అధికార పార్టీలోని వైరి వర్గం నేతలు దక్కించుకోగా వారికి వర్క్‌ఆర్డర్ ఇవ్వకుండా ఓ ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.