గ్రేటర్‌లో జపాన్‌ మియా వాక్‌ | Miyawaki Trees Planting in Haritha Haram GHMC | Sakshi
Sakshi News home page

మియా వాక్‌

Published Tue, Jun 16 2020 11:28 AM | Last Updated on Tue, Jun 16 2020 11:28 AM

Miyawaki Trees Planting in Haritha Haram GHMC - Sakshi

మియావాకీ..తక్కువ విస్తీర్ణంలోనే పెరిగే పచ్చని వనం..జపాన్‌లోని ప్రత్యేక విధానం!. నగరంలో రోజురోజుకూ హరించుకుపోతున్న లంగ్‌స్పేస్‌ను పెంచేందుకు ఈసారి హరితహారంలో ఈ విధానానికి ప్రాధాన్యమివ్వనున్నారు.నగరవ్యాప్తంగా వీలైనన్ని చోట్ల ఈ వనాలను పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్న హరితహారంలో భాగంగా మొక్కలు  నాటేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీ హరితహారం లక్ష్యం 50 లక్షల మొక్కలు. ఖాళీ ప్రదేశాలతోపాటు ఈసారి ఎక్కువగా రోడ్లు, చెరువు గట్లు,  బఫర్‌జోన్లు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీటితోపాటు మూసీ వెంబడి గ్రీనరీ పెంచేందుకు దాని పొడవునా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన గ్రేటర్‌ నగరంలో లంగ్‌స్పేస్‌ పెంచేందుకు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్‌ పద్ధతి మియావాకీకి ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మార్గాల్లోని మేజర్‌ రోడ్లు, మైనర్‌ రోడ్లలో అవకాశమున్న అన్ని చోట్లా మొక్కలు నాటుతారు. కాలనీల్లోని రహదారుల్లోనూ స్థానిక రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల సహకారంతో మొక్కలు నాటనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల కార్యాలయాల్లో వీలున్న ప్రాంతాల్లోనూ, గతంలో నాటిన మొక్కలు బతకని ప్రాంతాల్లోనూతిరిగి మొక్కలు నాటనున్నారు. 

అన్ని జోన్లలో..
జీహెచ్‌ఎంసీ లోని ఆరు జోన్లలోనూ ఈవిధానాన్ని అమలు చేయడంతోపాటు జోన్ల పరిధిలో ఈసారి  అవెన్యూ ప్లాంటేషన్లు, గ్రీన్‌కర్టెన్లు వంటì వాటికి శ్రద్ధ చూపుతున్నారు. ఖాలీ ప్రదేశాలున్న ప్రాంతాల్లో  ట్రీపార్కులుగా తీర్చిదిద్దడంతోపాటు అక్కడ వాకింగ్‌ ట్రాక్‌లు, తదితరసదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.  ఫ్లై ఓవర్ల కింద, మీడియన్లలో తక్కువఎత్తుతో ఉండే ప్రత్యేక మొక్కలు నాటనున్నట్లు  అడిషనల్‌ కమిషనర్‌ క్రిష్ట (బయోడైవర్సిటీ) క్రిష్ణ తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల కనుగుణంగా  నగరంలో పచ్చదనాన్ని పెంచి, కాలుష్యాన్ని నియంత్రించి, ఉష్ణోగ్రతలు తగ్గించి, ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించేకు ప్రతియేటా  హరితహారం కార్యక్రమం  నిర్వహిస్తున్నారు. హరితహారం కోసం జీహెచ్‌ఎంసీ ఆయా నర్సరీల్లో మొక్కల్ని సిద్ధం చేస్తోంది. 

మియావాకీ అంటే..
ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన  బొటానిస్ట్‌ అకీరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది. సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్‌లలో అర్బన్‌ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేయనున్నారు. అక్కడ మియావాకీ విధానాన్ని అమలు చేయనున్నారు. నగరవ్యాప్తంగా  అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement