టికెట్ తీసుకుంటున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, అధికారులతో సమీక్ష
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ సహకారం, ఉద్యోగుల సంకల్పదీక్షతో ప్రజలకు మరింత మెరుగైన రవాణాసేవాలను అందించేవిధంగా ఆర్టీసీని తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ పరిస్థితి, రవాణా సమస్యలు, ప్రయాణికులు, ఉద్యోగుల వినతులపై ఆయన సోమవారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎండీ ఖుస్రుషాఖాన్‌తో కలిసి ఆర్టీసీ, ఆర్టీఓ, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. అంతకు ముందు బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించి స్వయంగా టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో వసతులను, పరిసరాలను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు బాగుందని తెలిపారు. సంస్థ అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
సంస్థను దివాళాతీయించి వేలాది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు విపక్షాలు పన్నిన కుయుక్తులు పనిచేయలేవని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు అడగని వరాలను ముఖ్యమంత్రి ప్రకటించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని చెప్పారు. సంస్థ మనుగడలేకుండా చేసేందుకు యత్నించిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మహిళా ఉద్యోగులతోపాటు, సీనియర్ ఉద్యోగుల డ్యూటీ చార్ట్ విషయంలో మేలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు బస్టాండ్‌ల వద్ద నిలుపకుండా ఆర్టీఓ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీఏ అధికారి రఘనందన్‌గౌడ్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ విజయభాను, డిపో మేనేజర్లు నల్ల యేసు, గిరిమహేశం, శ్రీనివాస్, సీఐ గురువారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వైఎస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment