ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజల ప్రాణాలను ప్రైవేటు ట్రావెల్స్ బలితీసుకుంటున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్‌కు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. లారీలకు సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని కోరినా ఏపీ ప్రభుత్వంలో స్పందనలేదన్నారు.
15 రోజుల్లో దీనిపై చర్యలు తీసుకోకపోతే బస్సులు, లారీలను కోదాడ వద్ద ఆపేస్తామని హెచ్చరించారు. అక్రమ పర్మిషన్లతో బస్సులను నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పది మంది ప్రాణాలకు విలువ ఎవరు కడతారని ప్రశ్నించారు. ‘ప్రైవేటు ట్రావెల్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది.
ఏపీలో ఏమైనా చేసుకోండి కానీ తెలంగాణలో మాత్రం ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు ఆస్కారం లేదు. రాజకీయ ప్రమేయం లేకుండా దోషులను కఠినంగా శిక్షించాలి. రాజకీయ నేతలే వీటికి యజమానులు కావడం వల్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై పార్టీలు కూడా సమీక్షించుకోవాలి’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీలకే వందలాది బస్సులున్నాయని, ఏం చేసినా చెల్లుతుందనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ అక్రమాలను ఇరు ప్రభుత్వాలు అరికట్టాలని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రజలు ప్రయాణించాలని సూచించారు.