వెంటాడుతున్న మృత్యువు
=నగరం లోపల, వెలుపల ‘సిటీ’జన్లకు ప్రమాదాలు
=ఆగి ఉన్న వాహనాలతో పొంచి ఉన్న పెనుముప్పు
=ప్రాణాంతకంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం
=పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సమర్థంగా లేకే దుస్థితి
బుధవారం... తెల్లవారుతూనే విషాద వార్తను మోసుకొచ్చింది. మంగళవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆరుగురు మృత్యువాత పడిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ‘కొత్తకోట’ విషాదం తెలిసి నగరం ఉలిక్కిపడింది. ఆప్తులు, సన్నిహితుల సమాచారం కోసం సిటీజనులు ట్రావెల్ ఆఫీసు వద్దకు పరుగులు తీశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి.
సాక్షి, సిటీబ్యూరో : నగరవాసుల్ని గత కొన్నాళ్లుగా మృత్యువు వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా సైబరాబాద్, హైదరాబాద్‌ల్లోనే నమోదవుతున్నాయి. నగరవాసులు సిటీ లోపలా, వెలుపల రోడ్డు దుర్ఘటనల్లోనే అధికంగా మృత్యువాత పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలోనూ నగరానికి చెందిన వారు ఎక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం సమర్థంగా లేకపోవడంతో ప్రజలు ప్రయాణాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
నగరం బయట జరుగుతున్న ప్రమాదాల్లో 90 శాతం వరకు ఒకే ప్రమాదంలో ఒకటి కంటే ఎక్కువగానే మృతులు, క్షతగాత్రులు అవుతున్నారు. సాధారణంగా సిటీ దాటి వెళ్లేవారు శుభకార్యానికో, దైవదర్శనానికో వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒంటరిగా కాకుండా కుటుంబంతోనో, బంధువులు, మిత్రులతో కలిసో వెళ్తుంటారు. సుదూర ప్రాంతాలైతే నిత్యం వెళ్లి, వచ్చే వాళ్లు అనేక మంది ఉంటారు. వీరికి అనువైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ ఉండకపోవడంతో చాలావరకు ప్రైవేట్ ట్రావెల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా అంతా కలిసి ప్రయాణిస్తున్న సమయంలో అపశ్రుతులు చోటు చేసుకుంటే మృతులు, క్షతగాత్రులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నారు.
కారణాలనేకం..
ఈ ప్రమాదాలకు ప్రధానంగా డ్రైవర్ల అవగాహ న లేమి, అలసటల్నే కారణంగా చెప్పుకోవచ్చు. వాహనచోదకులు సాధారణంగా నిత్యం సంచరించే ప్రాంతాల్లోని రహదారులపై అవగాహన ఏర్పరుచుకుంటారు. అక్కడి రోడ్డు స్థితిగతులు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాలు తదితర భౌగోళిక అంశాలపై వీరికి అవగాహన ఉంటుంది. అయితే బయట ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ రహదారులు సైతం వీరికి పూర్తి కొత్త. ఈ నేపథ్యంలోనే మలుపుల్లో అదుపు తప్పడం, చెట్లను ఢీ కొట్టడం జరుగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు నిత్యం అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు.
వీరికి అవసరమైన స్థాయిలో రెస్ట్ లేకపోవడం, తొందరగా గమ్యం చేరాలనే ఆత్రుత తదితరాలు సైతం ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రయాణాలన్నీ ఎక్కువగా జాతీయ రహదారులపై సాగుతాయి. ఆయా ప్రాంతాల్లో ఆగి ఉంటున్న లారీలు ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సుదీర్ఘ ప్ర యాణం నేపథ్యంలో బ్రేక్ డౌన్ అయిన వాహనాలు ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. వీటిని రోడ్డు పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేసుకోవడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు అలసిపోయిన డ్రైవర్లు ధాబాలు, రెస్ట్‌హౌస్‌ల సమీపంలో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు.
వీటిని గమనించకుండా అతి వేగంగా వస్తున్న ప్రయాణికుల వాహనాలు, ఇతర లారీలు వెనుక, ముందు నుంచి ఢీ కొడుతున్నాయి. ఈ ఉదంతాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువగానే ఉంటోం ది. ఓవర్ టేకింగ్ సైతం ఇంకో ప్రమాద హేతువుగా ఉంది. నిబంధనలు బేఖాతర్ చేసి, రోడ్డు స్థితిగతులు పట్టించుకోకుండా దూసుకుపోతూ.. ముందున్న వాహనాల్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ.. ఎదురుగా వస్తున్న వాటిని ఢీ కొట్టిన సందర్భాలూ ఉంటున్నాయి. మచ్చుకు కొన్ని...
తేదీ: 5.2.13
ప్రమాద ప్రాంతం: మెదక్ జిల్లా ఒంటి మామిడి
ప్రయాణ కారణం: స్వస్థలానికి వెళ్లి వస్తూ..
ప్రమాద కారకం: పొగమంచు వల్ల లారీ ఢీ
మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/ఒకరు
ఎక్కడి వారు: ఖైరతాబాద్
తేదీ: 3.3.13
ప్రమాద ప్రాంతం: నిజామాబాద్ జిల్లా జక్కాన్‌పల్లి
ప్రయాణ కారణం: విహార యాత్ర
ప్రమాద కారకం: అదుపు తప్పి బోల్తా
మృతులు/క్షతగాత్రులు: ఇద్దరు/ఒకరు
ఎక్కడి వారు: ఎర్రగడ్డ
తేదీ: 29.3.13
ప్రమాద ప్రాంతం: దేవరకద్ర
ప్రయాణ కారణం: స్నేహితుల్ని కలిసి రావడం
ప్రమాద కారకం: ఎదురుగా వస్తున్న లారీ ఢీ
మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/0
ఎక్కడి వారు: శివరామ్‌పల్లి భవానీకాలనీ
తేదీ: 1.5.13
ప్రమాద ప్రాంతం: మహారాష్ట్రలోని తుల్జాపూర్
ప్రయాణ కారణం: షిర్డీ వెళ్లి వస్తుండగా..
ప్రమాద కారకం: అదుపు తప్పి చెట్టుకు ఢీ
మృతులు/క్షతగాత్రులు: ఇద్దరు/11 మంది
ఎక్కడి వారు: కూకట్‌పల్లి ప్రకాష్‌నగర్
తేదీ: 2.5.13
ప్రమాద ప్రాంతం: నల్లగొండ జిల్లా ఇనుపాముల
ప్రయాణ కారణం: సొంత ఇంటికి శంకుస్థాపన
ప్రమాద కారకం: ఓవర్ టేక్ సమయంలో డివైడర్ ఢీ
మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/నలుగురు
ఎక్కడి వారు: నగరంలో స్థిరపడ్డారు
తేదీ: 18.8.13
ప్రమాద ప్రాంతం: నందిగామ (కృష్ణా)
ప్రయాణ కారణం: దైవదర్శనం
ప్రమాద కారకం: ఓవర్ టేక్ చేస్తూ
మృతులు/క్షతగాత్రులు: ముగ్గురు/ఇద్దరు
ఎక్కడి వారు: అంబర్‌పేట్