'ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం దురదృష్టం'
'ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం దురదృష్టం'
Published Mon, Aug 21 2017 3:31 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీ ప్రాంగణంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేస్తే మంత్రి తోక ముడిచారని, సవాలు స్వీకరించలేక తన అనుచరులతో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 62 వేల ఎకరాల నుంచి 37 వేల ఎకరాలకు కుదించారని, ఈ ప్రాజెక్టు విస్తీర్ణం తగ్గించారని తాను అంటుంటే తగ్గించలేదని జూపల్లి అంటున్నారని, జీవోలో మార్పులు చేసి చేయలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం జిల్లా చేసుకున్న దురదృష్టమన్నారు.
ఆయనకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. డిండికి నీళ్లు తీసుకుపోవడానికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. డిండికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు లేఖ రాసింది జూపల్లి కాదా.. డిండికి నీళ్లు తీసుకుపోతున్నా ఎందుకు సైలెంటుగా ఉంటున్నారని ప్రశ్నించారు. కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించడంలో జూపల్లి పాత్ర ఉందని, ఈ వ్యవహారంలో కోట్లు దండుకున్నది జూపల్లి కాదా అని నిలదీశారు. తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానం చెప్పకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement