
ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో?
అధికార పార్టీ అభ్యర్థిత్వాలపై కొనసాగుతున్న సస్పెన్స్
►మూడు సీట్ల కోసం నేతల పోటాపోటీ
►పావులు కదుపుతున్న ఆశావహులు
►ఎంపికపై గులాబీ అధినేత కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థులకు మూడు స్థానాలు దక్కే అవకాశముండగా.. ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అభ్యర్థులపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో ఒకటి కలిపి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నా..
అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న వి.గంగాధర్ గౌడ్‌కు ఈసారి కూడా అవకాశం ఇవ్వనున్నారని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. దీంతో మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంఐఎం తమ రెండు స్థానాలను తమకు వదిలేయాలని టీఆర్‌ఎస్‌ను కోరే అవకాశం ఉందంటున్నారు. ఒక స్థానమైనా ఎంఐఎంకు ఇచ్చే అవకాశమున్నా.. ఇప్పటి దాకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. దీంతో మూడు స్థానాలపైనా టీఆర్‌ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు, వివిధ హామీలు పొంది ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీలో ఉన్నారు.
తెరపైకి పలువురి పేర్లు
ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నారని చెబుతున్నారు. ఇక పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు ఈ సారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో అవకాశమివ్వాలని ఆయన కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వీరితోపాటు వరంగల్‌కు చెందిన గుడిమల్ల రవికుమార్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా భువనగిరికి చెందిన పార్టీ సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది.
చర్చలో మహిళా అభ్యర్థి?
శాసస మండలిలో అత్యధిక మంది సభ్యులున్న టీఆర్‌ఎస్‌కు మహిళా సభ్యులు మాత్రం లేరు. దీంతో ఈసారి ఒక మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా కేసీఆర్ వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత కొద్దినెలలకే సుధా రాణి రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. ఆమె కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారని చెబుతున్నారు.