సాక్షి,హైదరాబాద్: ఆర్టీసీది పేరు గొప్ప ఊరు దిబ్బ పరిస్థితిగా మారింది. ఇటీవల ఆర్టీసీ చరిత్రలోనే కాక దేశంలోనే జరిగిన అతిపెద్ద రోడ్డు యాక్సిడెంట్‌గా పరిగణిస్తున్న కొండగట్టు బస్సు ప్రమాదమే అందుకు తాజా ఉదాహరణ. కేవలం లాభార్జనపైనే దృష్టిపెట్టి నిబంధనలకు నీళ్లొదిలి ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారిన బస్సుల్ని ఆర్టీసీ రోడ్డుపై నడుపుతోంది. కాలం చెల్లిన, ఫిట్‌నెస్ లేని దాదాపు నాలుగువేలకు పైగా పాతబస్సుల్లో జనాలను కుక్కి వారి జీవితాలతో ఆర్టీసీ చెలగాటమాడుతోంది. ఎక్కడికక్కడ ఊడుతున్న డోర్లు, సీట్లకు ఇనుప తీగలు, తాళ్లు కట్టుకుని నడుస్తోన్న బస్సులు ఆర్టీసీ దుర్భరస్థితిని లోకానికి చాటుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆర్టీఏ రోడ్లపై తిరుగుతున్న డొక్కు బస్సుల్ని, రోడ్లపై జరుగుతున్న బస్సు ప్రమాదాల్ని చూసి కూడా కళ్లుమూసుకుని మొద్దు నిద్రను నటిస్తోంది. కనీసం కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాతైనా ఆర్టీసీ, ఆర్టీఏ ఈ రెండూ కళ్లు తెరవలేదు.
పొంచి ఉన్న ముప్పు
తెలంగాణ ఆర్టీసీలో ఉన్న పాత బస్సులతో ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉంది. వీటిలో చాలా వరకు ఇప్పటికే తుక్కు దశకు చేరుకున్నా..అవే డొక్కు బస్సులను అధికారులు తిప్పుతున్నారు. ఇపుడు ఇవి మృత్యుశకటాలుగా మారి ప్రజలను అమాంతం మింగేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు అక్షరాలా 4,549 బస్సులు. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి.
కొత్త బస్సులు వద్దా?
2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1095గా ఉంది. స్క్రాప్ బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సు లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా కనిపించడం లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తుండటం గమనార్హం.
- ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్షీ రేషియో దారుణంగా ఉంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. కొన్ని రూట్లలో ఒకరిద్దరే ఎక్కుతున్నారు.
- ఈనెల 5న దాదాపుగా రూ.100 కోట్ల కేంద్రం గ్రాంటుతో 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడతగా 5 బస్సులు నగరానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పర్యావరణ కోణంలో ఇలాంటి బస్సులను నడపాల్సిందే. కానీ, వాటిపై చూ పిన శ్రద్ధ గ్రామీణ, జిల్లాల్లో కొత్తబస్సులపైనా చూపిస్తే.. వాటికి వెచ్చించే బడ్జెట్‌లో జిల్లా బస్సులకు వెచ్చి స్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని యూని యన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు కాకుండా..ప్రజలకు, కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.
ఆర్టీఏ తనిఖీలెక్కడ?
ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు పట్టించుకున్న దాఖలాలు తక్కువ. పోనీ, తనిఖీలు చేపట్టినా.. వెంటనే ఫోన్లు చేసి తమను అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులే వాపోతున్నారు. కాలంచెల్లిన బస్సులు రోడ్లపై తిరుగుతున్నా గుడ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులకు నడిచేందుకు ఏమాత్రం అర్హతలేదు అయినా వీటిల్లో జనాలను కుక్కి పంపుతోంది ఆర్టీసీ.
ఇదీ ఆర్టీసీ లెక్క
ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా
రోజువారీ ప్రయాణికులు 97,00,000
ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000/ (రూ.12కోట్లు)
సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549.
వీటిలో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000 మందికిపైగా
ఈ బస్సులు ఎపుడు.. ఎక్కడ ప్రమాదానికి గురవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment