
చిన్న నీటి వనరులతోనే ఎక్కువ మేలు
చెరువులపై వర్క్‌షాప్‌లో మంత్రి హరీశ్‌రావు
ఐదురోజులు దాటినా నో పోస్టింగ్స్
సాక్షి, హైదరాబాద్: భారీ సాగునీటి ప్రాజెక్టుల కన్నా చిన్న నీటి వనరుల పునరుద్ధరణతో ఎక్కువ మేలు జరుగుతుందని, అందుకే ‘మిషన్ కాకతీయ’కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా, గోదావరి నదుల కింద చిన్న నీటి వనరులకు 265 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణలో ప్రతి నీటిచుక్కను సక్రమంగా వినియోగించుకునేలా చెరువుల పునరుద్ధరణ చేయాల్సి ఉంది. భారీ ప్రాజెక్టులు చేపడితే వాటికి భూసేకరణ, పర్యావరణం వంటి అన్ని అనుమతులు కావాలి. రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టు 13 ఏళ్లుగా, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 30 ఏళ్లుగా, కల్వకుర్తి 10 ఏళ్లుగా కొనసాగుతున్నా నిర్ణీత ఆయకట్టులో 10 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. అదే చెరువుల పునరుద్ధరణకు ఇలాంటి సమస్య ఉండదు.
కేటాయింపుల మేర నీటిని వాడుకునేలా చెరువుల పునరుద్ధరణ చేయగలిగితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు సమానమైన ఆయకట్టుకు నీరివ్వగలం’ అని ఆయన పేర్కొన్నారు. అందుకే ఏడాదికి రూ.5,500ల కోట్లతో 9వేల చెరువుల చొప్పున పునరుద్ధరించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. శుక్రవారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి సంస్థ ఆడిటోరియంలో ‘తెలంగాణలో చెరువుల నిర్వహణ’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, వ్యవస్థాగత లోపాలను ఆసరాగా చేసుకొని పట్టణ ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తున్నారని, దీనికి సామాజిక రక్షణ (సోషల్ ఫెన్సింగ్) ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. చెరువుల పూర్తి సామర్థ్యం(ఎఫ్‌టీఎల్)ను నిర్ధారించి దాని చుట్టూ మొక్కలునాటే పనులు చేపట్టి వాటిని కాపాడుకునే బాధ్యత స్థానిక ప్రజా కమిటీలకే ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని చెరువుల కబ్జాలపై రెండు మూడు రోజుల్లో వివిధ శాఖలతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
చెరువుల్లో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గోదావరి పరీవాహకంలో ఇసుక లభ్యత ఉన్న దృష్ట్యా అక్కడ.. ప్రభుత్వమే ఇసుక తీసి అమ్మకాలు చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. వనరుల నిర్వహణలో నిపుణుడు బీవీ సుబ్బారావు మాట్లాడుతూ, చెరువుల్లో నీరు సమృధ్ధిగా వచ్చేందుకు పరీవాహక రక్షణ చాలా ముఖ్యమన్నారు. నీరు, ఆహార భద్రతకు నమూనాలుగా చెరువులను తీర్చిదిద్దాలని సూచించారు. పర్యావరణ విధాననిపుణుడు కె.పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ నగరంలో ఉన్న 2వేల చెరువులను నింపినప్పుడే అభివృధ్ధి సాధ్యమని అన్నారు. వర్క్‌షాప్‌లో ఎంసీహెఆర్‌డీఐ డీజీ లక్ష్మీ పార్థసారధి, ఐఐపీఏ శాశ్వత సభ్యుడు కృష్ణసాగర్‌రావు తది తరులు పాల్గొన్నారు.