ఇక మరిన్ని బీసీ కాలేజీ హాస్టళ్లు | More then BC College hostels | Sakshi
Sakshi News home page

ఇక మరిన్ని బీసీ కాలేజీ హాస్టళ్లు

Published Wed, May 13 2015 12:57 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

ఇక మరిన్ని బీసీ కాలేజీ హాస్టళ్లు - Sakshi

ఇక మరిన్ని బీసీ కాలేజీ హాస్టళ్లు

పాలిటెక్నిక్ కాలేజీల ఆవరణల్లో ఏర్పాటు
బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలకు సాంకేతిక విద్యాశాఖ ఆమోదం

 
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన కాలేజీ హాస్టళ్ల ఏర్పాటునకు మార్గం సుగమమైంది. ఈ హాస్టళ్ల నిర్మాణానికి అనువైన స్థలం లభించకపోవడం కొంత ఇబ్బందిగా మారడంతో ఈ విషయంలో ఇప్పటివరకు కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్న బీసీ కాలేజీ హాస్టళ్లకు అదనంగా జిల్లాకు ఒకటి నుంచి రెండు వరకు కొత్త హాస్టళ్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల ఆవరణలో బీసీ కాలేజీ హాస్టళ్ల ఏర్పాటుకు బీసీ సంక్షేమశాఖ, సాంకేతిక విద్యాశాఖ పరస్పరం అంగీకారం తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పది జిల్లాల్లో 47 పాలిటెక్నిక్ కళాశాలలుండగా వాటిలోని 25 పాలిటెక్నిక్ కాలేజీల ప్రాంగణాల్లో ఈ హాస్టళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతిక విద్యాశాఖ అంగీకరించింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు కొనసాగింపుగా బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి రూ. 3 కోట్ల వరకు వ్యయం కావొచ్చని అధికారులు అంచనా వేశారు. హాస్టళ్ల నిర్మాణానికి ప్రస్తుతం బీసీశాఖ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీలైనంత మేర నిధులు తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, హాస్టళ్లలో ఎంతమంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించాలి, అందులో పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు ఎన్ని సీట్లు కేటాయించాలి, తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
 
బీసీ హాస్టళ్లలో మరిన్ని సౌకర్యాలు

 రాష్ట్రంలోని 247 బీసీ కాలేజీ వసతి గృహాల్లో (ఒక్కో హాస్టల్‌లో రెండేసి కంప్యూటర్ల ఏర్పాటు) కంప్యూటర్ల ఏర్పాటుపై ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)కు బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపనుంది. బీసీ కాలేజీల వసతి గృహాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ హాస్టళ్లలో ఆయా సౌకర్యాల కల్పనకు అవసరమైన రూ. 110 కోట్ల బడ్జెట్ కూడా అందుబాటులో ఉండటంతో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. హాస్టళ్లలో ఆధునిక గ్రంథా లయం, ఇతర సమాచారంతో కూడిన సీడీలు, ఇతర ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను అందించాలని బీసీ సంక్షేమశాఖ యోచిస్తోంది. కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్ల విధానంలోనూ మార్పులు తేవాలనే ఆలోచనతో ఉంది. హాస్టల్ అడ్మిషన్లను సైతం ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులవారీగా, మెరిట్ ఆధారంగా, ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులవారీగా కోటాల ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది. ఇలా హాస్టళ్లలో అన్ని బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతోపాటు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement