గాలిలో మేడలు... | More threats to construct Sky ways at Hussain sagar | Sakshi
Sakshi News home page

గాలిలో మేడలు...

Published Sat, Jan 10 2015 9:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

గాలిలో మేడలు...

గాలిలో మేడలు...

* సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి అడ్డంకులెన్నో?
* ఖరారు కాని సాగర్ ఎఫ్‌టీఎల్ తేలని శిఖం భూముల లెక్కలు  
* శాశ్వత కట్టడాలపై కోర్టుల నిషేధం.. సర్కారుకు నివేదించిన హెచ్‌ఎండీఏ!
* ప్రాజెక్టుకు నిధుల విడుదలపై సందిగ్ధం  

 
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి. కబ్జాలతో సాగర్ శిఖం భూములు కుంచించుకుపోవడంతో సరిహద్దులపై స్పష్టత లేదు. సాగర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) కచ్చితంగా నిర్ధారణ కాలేదు. సాగర్ ఎఫ్‌టీఎల్ వెలుపలి భాగంలో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, ఆకాశ మార్గాలు (స్కై లైన్లు) నిర్మించాలని టీ సర్కార్ భావిస్తున్నప్పటికీ అసలు ఎఫ్‌టీఎల్‌పైనే స్పష్టత లేదు. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించకుండానే ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కు స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాగర్ తీరంలో అనుమతి లేకుండా శాశ్వత కట్టడాలను నిర్మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సైతం మరో అడ్డంకిగా నిల వనుంది. దీనికి తోడు సాగర్ పరిరక్షణ కోసం పలువురు పర్యావరణ ప్రేమికులు వేసిన ఎన్నో వ్యాజ్యాలు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి ఇవన్నీ అడ్డంకిగా మారనున్నాయని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఇటీవల ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
 
 ఎత్తైన భవనాలు నిర్మిస్తామన్న సీఎం
 అత్యంత ఎత్తైన భవనాలను సాగర్ తీరంలో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ కొద్ది నెలల కింద ప్రకటించారు. దాదాపు 60 నుంచి 100 అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నెల కిందట జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎం ఆదేశించారు. సాగర్ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా జలాశయంలోకి మురుగునీటిని తీసుకు వస్తున్న నాలాల మళ్లింపుతో పాటు సాగర్ ఎఫ్‌టీఎల్ వెలుపల ఆకాశ హర్మ్యాలు, ఆకాశమార్గాల నిర్మాణంపై అధ్యయనం, ఇతర ఖర్చులకు రూ.100 కోట్లను కేటాయించాలని గత నవంబర్ 9న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.   హుస్సేన్‌సాగర్ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.100 కోట్లను విడుదల చేయాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికీ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలతో పాటు సాగర్ పరిరక్షణ విషయంలో వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రతిపాదనలు అంది నెలయినా నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ఏ నిర్ణయం తీసుకోలేదు.
 
 పర్యావరణవేత్తల ఆందోళన
 సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై  పర్యావరణవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కాసారంగా మారిన నాలాలు ఇప్పటికే సాగర్ తీరంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. ఈ నాలాల మళ్లింపుపై ఇంకా ఎలాంటి ప్రణాళిక సిద్ధం కాలేదు. జైకా ఆర్థిక సహాయంతో గతంలో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సాగర్ తీరంలో నిర్మాణాలకు గత ప్రభుత్వాలు అనుమతించగా.. తాజాగా ఆకాశ హర్మ్యాల రూపంలో భారీ కట్టడాలు నిర్మిస్తే తీరప్రాంతం మరింత కుంచించుకుపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement